బీజేపీలోకి టీడీపీ కీల‌క నేత!

Update: 2022-10-10 07:32 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో విజ‌యం సాధిస్తామ‌ని బీజేపీ ఇటీవ‌ల భారీ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. ఏపీలోని వేలాది వీధి గ‌ర్జ‌న స‌భ‌లు పెట్టి కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. గ‌తంలో ఏపీకి వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాతో ఏపీలో బీజేపీ ఒంట‌రిగా అధికారంలోకి రావ‌డానికి గట్టి కృషి చేయాల‌ని ఆ పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న కీల‌క నేత‌ల‌పై బీజేపీ దృష్టి సారించింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో గుంటూరు జిల్లాలో టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావుపై దృష్టి సారించింద‌ని చెబుతున్నారు.

రాయ‌పాటి సాంబ‌శివ‌రావు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. పొగాకు వ్యాపారాలు ఉన్న ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు గుంటూరు నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా గెలుపొందారు. 1996, 1998, 2004, 2009ల్లో గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన రాయ‌పాటి ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జన జ‌రిగాక టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో న‌ర‌స‌రావుపేట నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. గ‌తంలో ఒక ప‌ర్యాయం కాంగ్రెస్ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. 2019 ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రాయ‌పాటి వైసీపీ అభ్య‌ర్థి లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. న‌ర‌స‌రావుపేట ఎంపీగా త‌న‌కు, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా త‌న కుమారుడు రాయ‌పాటి రంగారావుకు సీట్లు కావాల‌ని కోరుతున్న‌ట్టు స‌మాచారం. అయితే కుటుంబంలో ఒక‌రికి ఒక్క సీటే ఇస్తామ‌ని టీడీపీ ఆయ‌న‌కు తేల్చిచెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆయ‌న టీడీపీపైన కొంత అసంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు.

అంతేకాకుండా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, స‌భ‌ల‌కు త‌న‌ను ఆహ్వానించ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని తాను చెప్పిన‌ప్ప‌టికీ.. క‌నీసం టీడీపీని స‌మ‌ర్థిస్తున్న మీడియాలోనూ ఈ వార్త‌కు ప్రాధాన్య‌త క‌ల్పించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న కినుక వ‌హించార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్న‌ట్టు బీజేపీలో చేరాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఆయ‌న‌కు, ఆయ‌న కుమారుడు రంగారావుకు రెండు టికెట్లు ఇవ్వ‌డానికి సిద్ధ‌మైన‌ట్టేన‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు చెందిన సంస్థ‌ల‌పై కేసులు ఉన్నాయి. బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లించ‌లేద‌ని ఆయ‌న‌పై కేసులు నమోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనూ ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు.

కాగా గ‌తంలో రాయ‌పాటి సాంబశివ‌రావు సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్ గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా ప‌నిచేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News