తమ్ముడు పొగడ్త ఆ ఇద్దరికీ ఇబ్బందేమో..?

Update: 2015-12-08 13:47 GMT
పొగడ్తకు మించిన ఆయుధం మరేది ఉండదు. ఎంతటి వాడినైనా ప్లాట్ చేసే శక్తి పొగడ్తకు మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు అతిశయోక్తిగా పొగిడేసినా.. పొగిడించుకునే వాడు మాత్రం ఫీలవ్వరు. మనిషి అన్నాక పొగడ్తకు పడిపోనోడు ఎవరుంటారు చెప్పండి. అలా అని పొగడ్త వల్ల అంతా లాభమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పొగిడేవాడికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ.. పొగిడించుకునే వాడికి ఊహించని రీతిలో దెబ్బ పడటం ఖాయం. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైబీపీ రాజేంద్రప్రసాద్ చేసిన పొగడ్తకు ఇలాంటి ప్రమాదమే ఉందని చెప్పొచ్చు.

తాజాగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల్ని ఓ రేంజ్ లో పొగిడేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి అని వ్యాఖ్యానించిన రాజేంద్రప్రసాద్.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా రాష్ట్రపతి అవుతారంటూ జోస్యం చెప్పారు.

దేశంలోనే అత్యంత కీలకమైన రెండు పదవులు ఇద్దరు తెలుగువారికి.. అందునా ఆంధ్రులకు వస్తుందని చెప్పటం ద్వారా.. సదరు నేతలకు హాయిగా అనిపించేలా పొగిడేసినా.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించిన ప్రధాని మోడీ మాటేమిటో మాత్రం రాజేంద్ర ప్రసాద్ చెప్పకపోవటం కాస్తంత లోటే. మోడీ లాంటి నేతకు.. రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్ల పొగడ్తల గురించి తెలిస్తే.. చంద్రబాబు.. వెంకయ్య పరిస్థితి ఏమవుతుందో ఆయన కాస్త ఆలోచించారా? ఆలోచిస్తే అలాంటి వ్యాఖ్యలు చేసే వారు కాదేమో..?

Tags:    

Similar News