బాబు వ‌స్తున్నాడు... లీడ‌ర్ పోతున్నాడు

Update: 2017-05-22 17:37 GMT
తెలంగాణ‌లో ఇప్ప‌టికే కునారిల్లిపోయిన తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘ కాలంగా తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతుంటే..అదే స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్‌లో చేర‌నున్నార‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ టీఆర్‌ఎస్‌ లో చేరనున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది. ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన చేరిక ఖరారైందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మ‌హానాడుకు తెలుగుత‌మ్ముళ్లు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంతో రాథోడ్ కారెక్క‌డం టీడీపీకి భారీ షాక్ వంటి వార్త అని రాజ‌కీయవ‌ర్గాలు అంటున్నాయి.

సుదీర్ఘ‌కాలంగా కేంద్రంలో నామినేటెడ్ ప‌ద‌వి కోసం వేచి చూస్తున్న రాథోడ్ ర‌మేశ్ త‌న‌కు ఎలాంటి బెర్త్ ద‌క్క‌క‌పోవ‌డం, అదే స‌మ‌యంలో టీడీపీ పుంజుకునే చాన్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో...త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును సంప్రదించ‌గా ఆయ‌న‌ మధ్యవర్తిత్వం వహించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్‌లో చేరేలా రమేశ్‌ రాథోడ్‌ను ఒప్పించిన తుమ్మ‌ల 2019 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే ఉట్నూర్‌ లేదా ఖానాపూర్‌ నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి హామీ ఇప్పించారని స‌మాచారం. దీంతో సైకిల్ దిగి కారెక్కేందుకు రాథోడ్ ర‌మేశ్ రెడీ అయ్యారని టాక్‌.

కాగా మ‌హానాడును ఈ నెల 27, 28, 29 తేదీల్లో విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ టీడీపీ కోసం ప్ర‌త్యేకంగా మ‌హానాడు నిర్వ‌హించేందుకు టీటీడీపీ సిద్ధ‌మ‌యింది. ఈనెల 24న నిర్వ‌హించ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ ర‌థ‌సారథి చంద్ర‌బాబు హాజ‌రుకానున్నారు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత చంద్ర‌బాబు తెలంగాణ‌లో హాజ‌ర‌వుతున్న స‌భ ఇది కాగా అదే స‌మ‌యంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు త‌న‌దారి తాను చూసుకోవ‌డం ఆస‌క్తికరంగా మారింది.
Tags:    

Similar News