వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు.. కారణమిదే!

Update: 2022-06-10 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థుల వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. జూన్ 9న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, మహిళా విభాగం నేత కొత్తపల్లి రజని తదితరులు చొరబడ్డ సంగతి తెలిసిందే.

విద్యార్థులతో రాజకీయాలు ఎందుకు చేస్తున్నావని.. వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నావని లోకేష్ పై వైఎస్సార్సీపీ నేతలు జూమ్ మీటింగ్ లో గొడవ పడ్డారు. దీనిపై తాజాగా వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మీటింగ్ లోకి తమ అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ నేతలు చొరబడ్డారని మండిపడ్డారు.

రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకు వైఎస్సార్సీపీ నాయకులు లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారంటూ సీఐడీ అడిషనల్ డీజీకి ఇచ్చిన ఫిర్యాదులో వర్ల రామయ్య పిర్యాదు చేశారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారని వర్ల రామయ్య తెలిపారు.

లక్షల మంది విద్యార్థులు పదిలో ఫెయిల్ అయి తీవ్ర భయాందోళనలో ఉన్నారని వర్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫెయిల్ అయి బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలకు జూమ్ మీటింగ్ ద్వారా భరోసా కల్పించేందుకు లోకేష్ మీటింగ్ ఏర్పాటు చేశారని వర్ల రామయ్య తెలిపారు.

అయితే కొంతమంది అధికార పార్టీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారని వర్ల ఆరోపించారు. నారా లోకేష్ పై అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీ లు మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారని తెలిపారు. నేరపూరిత కుట్రతో, లోకేష్ జూమ్ మీటింగ్ ను భగ్నం చేయడానికి అక్రమంగా చొరబడ్డారని ఆరోపించారు.
Tags:    

Similar News