బాబుతో కాలేదు!..అమిత్ షాతో అవుతుందా?

Update: 2018-01-30 11:05 GMT
ఏపీలో రాజ‌కీయం వేడెక్కిపోయింది. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌య‌ముండ‌గా... ఇప్పుడే ప‌రిస్థితి ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తోంది. అది కూడా అధికార - విప‌క్షాల మ‌ధ్య కాకుండా... అధికార కూటమిలోని రెండు పార్టీల మ‌ధ్య ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం నిజంగానే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నిన్న‌టిదాకా ఈ రెండు పార్టీల మ‌ధ్య ప‌రిస్థితి పాలూ నీళ్ల‌లా ఉన్నా.. మొన్న ఓ పార్టీకి చెందిన కీల‌క నేత సంధించిన వాగ్బాణాలు ప‌రిస్థితిని మ‌రింత‌గా వేడెక్కించింద‌నే చెప్పాలి. ఆ వేడిని త‌గ్గించ‌డం, వ‌చ్చే ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మ‌ధ్య స‌యోధ్య ఉండేలా చూసుకునేందుకు రెండో పార్టీకి చెందిన కీల‌క నేత ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. అయితే ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజీ దాదాపుగా జ‌రిగిపోగా... స‌ద‌రు కీల‌క నేత ఏ మేర‌కు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతార‌న్న విష‌యం తేలాల్సి ఉంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితులు గ‌తంలోనూ క‌నిపించినా... ఎప్ప‌టిక‌ప్పుడు ఆ రెండు పార్టీల నేత‌లు స‌ర్దుకుంటూనే ఉన్నారు. మ‌రి ఈ సారి ఆ త‌ర‌హా ప్యాచ‌ప్ జ‌రుగుతుందా?  లేదా? అన్న‌ది చూడాలి. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీలు క‌లిసే బ‌రిలోకి దిగాయి. ఈ కూట‌మికి టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం బాగానే లాభించింది. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా... కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ద‌క్కించుకుంది.

మొత్తానికి గ‌డ‌చిన నాలుగేళ్లుగా మిత్ర‌ప‌క్షాలుగానే కొన‌సాగుతూ వ‌స్తున్న ఈ రెండు పార్టీలు మిత్ర‌ధ‌ర్మాన్ని కూడా పాటిస్తూ వ‌స్తున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారులో టీడీపీ ఎంపీలకు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌గా, ఏపీలో టీడీపీ నేతృత్వంలో ఏర్పాటైన ప్ర‌భుత్వంలో బీజేపీ ఎమ్మెల్యేల‌కూ చోటు ద‌క్కింది. అయితే రాజ‌కీయాల‌న్నాకా... నోరు ఊరికే ఉండ‌దు క‌దా. ఈ త‌రహా నేత‌లు ఇరు పార్టీల్లో ఉన్నా.. బీజేపీలోనే ఈ త‌ర‌హా మాట‌ల మంట‌కు నాందీ ప‌లికింద‌న్న వాద‌న లేక‌పోలేదు. మిత్ర‌ప‌క్షం పార్టీ ప్ర‌భుత్వ‌మే న‌డుస్తున్నా... త‌మ ప‌నులేమీ జ‌ర‌గ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా.. అస‌లు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి కార‌ణంగా ఏపీకి ద‌క్కాల్సిన ఏ ఒక్క ప్ర‌యోజ‌నం కూడా ద‌క్క‌డం లేద‌ని, మ‌రి దీనినేమంటార‌ని కూడా టీడీపీ నేత‌లు మండిప‌డ్దారు. మొత్తానికి విడ‌త‌ల‌వారీగా కొన‌సాగిన ఈ మాట‌ల మంట‌ల‌ను చ‌ల్లార్చేందుకు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడే ముందుగా రంగంలోకి దిగారు. బీజేపీ నేత‌లు ఏమ‌న్నా... మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఆ పార్టీ నేత‌ల‌ను ప‌ల్లెత్తు మాట కూడా అన‌డానికి వీల్లేద‌ని బాబు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇటీవ‌లి కాలంలో బీజేపీ నేత‌లు సోమూ వీర్రాజు - ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి - చివ‌ర‌కు ఇరు పార్టీల‌కు ఇష్టుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా రంగంలోకి దిగిపోయి టీడీపీ స‌ర్కారుకు ఊపిరాడ‌నీయ‌కుండా చేసేశారు. పార్టీ ఫిరాయింపుల ద‌గ్గర నుంచి రాష్ట్రంలో అవినీతి పాల‌న‌, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఎవ‌రి బాధ్య‌త ఎంత‌? అన్న విష‌యం దాకా ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. ఈ నేప‌థ్యంలోనే మొన్న దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత మీడియా స‌మావేశం పెట్టిన చంద్రబాబు కూడా బీజేపీ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. మిత్ర‌ప‌క్షంగా బీజేపీ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, త‌మ‌తో పొత్తు వ‌ద్ద‌ని ఆ పార్టీ భావిస్తే న‌మ‌స్కారం పెట్టి వెళ్లిపోతామ‌ని బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేశారు. అస‌లు బీజేపీ మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించ‌డం లేద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. దీంతో షాక్ తిన్న బీజేపీ నేత‌లు... తామేమీ త‌క్కువ తిన‌లేద‌ని చెబుతూ టీడీపీనే మిత్ర‌ధ‌ర్మం పాటించ‌డం లేద‌ని కౌంట‌ర్లిచ్చారు. అంతేకాకుండా టీడీపీ వ్య‌వ‌హార స‌ర‌ళిని ఎండ‌గ‌డుతూ ఏకంగా ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య బంధం చెడిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు దేనిక‌దే విడిగా పోటీ చేస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి.

ఆ నోటా, ఈ నోటా ఈ విష‌యం బీజేపీ అధిష్ఠానం దాకా చేరిపోయింది. ఏపీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే త‌ప్పించి రాణించే అవ‌కాశాలు లేవ‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. నిన్న మోదీ ఆధ్వ‌ర్యాన జ‌రిగిన ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల భేటీకి హాజ‌రైన టీడీపీ ప్ర‌తినిధులు సుజ‌నా చౌద‌రి - తోట న‌ర‌సింహంల‌కు ఆయ‌న క‌బురు పెట్టార‌ట‌. మంగ‌ళ‌వారం త‌న‌తో భేటీ కావాల‌ని, ఈ భేటీలో ఇరు పార్టీల మ‌ధ్య బంధంతో పాటుగా... ఇటీవ‌ల పార్టీల మ‌ధ్య నెల‌కొన్న అంత‌రం, ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్ర‌యోజ‌నాలు త‌దిత‌రాల‌పై చ‌ర్చిద్దామంటూ షా నుంచి వ‌ర్త‌మానం రాగానే టీడీపీ కూడా అల‌ర్ట్ అయిపోయింది. మ‌రీ ఏమీ త‌గ్గాల్సిన ప‌నిలేద‌ని, బీజేపీ వైఖ‌రికి అనుగుణంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్రబాబు వారిద్ద‌రికి సూచించార‌ట. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రిగ‌నున్న ఈ స‌మావేశంలో అమిత్ షా ఏ మేర‌కు రెండు పార్టీల మ‌ధ్య ప్యాచ‌ప్ వేస్తారో చూడాలి.

Tags:    

Similar News