యాక్సిస్ బ్యాంకులో టీడీపీ నేత‌ల డిపాజిట్లు

Update: 2016-12-18 11:30 GMT
యాక్సిస్ బ్యాంక్‌..గ‌తంలో కంటే ఇపుడు ఈ బ్యాంక్ చాలా పాపుల‌ర్‌! కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలు సాగాయనే ఆరోపణలతో ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ గుర్తింపు ఉన్న‌ యాక్సిస్‌ వివాదాల్లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యాన ఆ సంస్థ కొంద‌రు సీనియ‌ర్ ఉద్యోగులను తొల‌గించింది అంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే తాజా వార్త ఏమింటే.. ఆ బ్యాంకుల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు - వారి కంపెనీలు - బినామీలు పెద్ద మొత్తంలో నల్ల డబ్బు డిపాజిట్‌ చేసినట్లు ఆరోపణలు రావ‌డం!

దేశ వ్యాప్తంగా రూ.500 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రద్దయిన పాత కరెన్సీ కట్టలను ఒక పథకం ప్రకారం గుట్టుచప్పుడు కాకుండా యాక్సిస్‌ బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. యాక్సిస్‌లో భారీ స్థాయిలో నల్ల ధనం తెల్ల ధనంగా మార్పిడి జరిగిందని వార్తలు బయటికి రావడం - పదుల సంఖ్యలో బ్యాంక్‌ అధికారులు సస్పెన్షన్‌ కు గురి కావడం - యాక్సిస్‌ లో ఖాతాలన్నింటిపైనా ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) - ఆదాయపన్ను (ఐటి) - కేంద్ర పరిశోధనా సంస్థ (సిబిఐ)లోని అవినీతి నిరోధక విభాగాలు కన్నేయడం నేప‌థ్యంలో ఈ వివ‌రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో రాజధాని ప్రాంతం అమరావతిలో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న బడా బాబులు - ఇసుక అక్రమ దందాలో చక్రం తిప్పిన పెద్దలు - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో కాంట్రాక్టులు దక్కించుకున్న వారు, కొంత మంది నాయకులకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారు ప్రధానంగా యాక్సిస్‌ లో పెద్ద మొత్తంలో నల్ల ధనాన్ని డిపాజిట్‌ చేసి తెల్ల ధనంగా మార్చుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. టిడిపిలో బహిరంగంగానే ఈ విషయంపై చర్చ సాగుతోంది.

బెజవాడ - గుంటూరు కేంద్రంగా యాక్సిస్‌ బ్యాంక్‌ ల్లో టిడిపి పెద్దలు - అనుచరులకు చెందిన వందల కోట్ల పాత కరెన్సీ జమ అయినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంకా తిరుపతి - విశాఖపట్నం - కర్నూలులో కూడా డిపాజిట్‌ చేశారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తుందని ఉప్పు అందిన మరుక్షణం టిడిపి ప్రముఖులు - అనుచరగణం యాక్సిస్‌ ను ఆశ్రయించారని తెలిసింది. అధికారంలో ఉన్నందున రాష్ట్ర - జిల్లా స్థాయిలోని కొందరు లీడ్‌ బ్యాంక్‌ అధికారులతో మాట్లాడుకొని 'పని' కానిచ్చినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలో సిఎంకు అత్యంత సన్నిహితుడైన ఒక బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పాత కరెన్సీని డిపాజిట్‌ చేశారని సమాచారం. రాయలసీమకు చెందిన ఒక ఎంపీ - రవాణా వ్యాపార దిగ్గజం - అదే ప్రాంతానికి చెందిన సీఎం బినామీగా చెప్పుకొనే మరో ఎంపీ - భారీ కాంట్రాక్టు పనుల్లో వివాదాలెదుర్కొంటున్న దక్షిణ కోస్తాకు చెందిన ఎంపీ - సిఆర్‌ డిఎ ప్రాంతంలో పాగా వేసిన ఎంపీ - కేబినెట్‌ లో బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే దక్షిణ కోస్తాకు చెందిన ఇద్దరు కీలక మంత్రులు - రాయలసీమలో బెంగళూరుకు సమీపంలో ఉండే మంత్రి - ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో చక్రం తిప్పుతున్న కోస్తాకు చెందిన ఎమ్మెల్సీ - ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలెదుర్కొంటున్న ఎంపీ యాక్సిస్‌ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత కరెన్సీని మార్చుకున్నట్లు సమాచారం.

ఏపీలోని బ్యాంకులతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని యాక్సిస్‌ బ్యాంకుల్లోనూ టీడీపీ ప్రముఖులు - కాంట్రాక్టర్లు - వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున పాత పెద్ద నోట్ల కట్టలను డిపాజిట్‌ చేశారనేది పెద్ద టాక్ . హైదరాబాద్‌ - బెంగళూరు - చెన్నరు సహా పలు నగరాల్లో పెద్ద ఎత్తున రద్దయిన నోట్లను జమ చేసినట్లు సమాచారం. ఆయా నగరాలకు దగ్గరగా ఉన్న ఏపీ జిల్లాలకు చెందిన టీడీపీ ప్రముఖులు - బినామీలు అక్కడకు అత్యంత చాకచక్యంగా డబ్బును తరలించి డిపాజిట్‌ చేయించారని తెలిసింది. ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాలపై నిఘా పెరగడం, డిపాజిట్ల వారీగా దర్యాప్తు జరుగుతుండటంతో 'నల్ల' డిపాజిట్‌ దారుల్లో భయాం దోళనలు రెట్టింపయ్యాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారన్న ప్రచారంతో 'పెద్ద'లకు కంటిపై కునుకు లేదు. ఆర్‌ బిఐ కలగజేసుకొని లైసెన్స్‌ ను రద్దు చేయడం లేదని అధికారికంగా ప్రకటన చేశాక ఊపిరి పీల్చుకున్నారు. అయినా విచారణ కొనసాగుతున్నందున దాని నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లూ పడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News