ఆ రకంగా జగన్‌ పై కొత్త కేసులు వేయిస్తారా?

Update: 2016-09-04 04:46 GMT
మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతూ విమర్శలు గుప్పించడంలో రాజకీయ నాయకులు సందర్భం వచ్చినప్పుడెల్లా తమ టేలెంటు బయటపెడుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా తమ ప్రత్యర్థుల్ని రచ్చకీడ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రకంగా చూసినప్పుడు.. తాజాగా జగన్‌ మీద కొత్తగా కోర్టు ధిక్కారం కేసులు బనాయించడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా జనం అనుకుంటున్నారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పనిగట్టుకుని విడుదల చేసిన ఒక ప్రకటన ఇంచుమించు ఇలాంటి కుట్రకు శ్రీకారంలాగానే ఉన్నదని జనం భావిస్తున్నారు. జగన్‌ మీద రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ప్రెవేటు వ్యక్తుల ద్వారా కోర్టు ధిక్కార కేసులు పెట్టించి.. రాద్ధాంతం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా యనమల ప్రకటన ఉన్నదని ప్రజలు భావిస్తుండడం గమనార్హం.

ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఏంటో తేల్చాలంటూ ఏసీబీ కోర్టు తమ శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. వైకాపా ఎమ్మెల్యే వేసిన కేసు పర్యవసానంగా.. చంద్రబాబు పాత్రను తేల్చాలని, విచారణను పూర్తిచేయాలని కోర్టు ఆదేశించింది. అందుకు డెడ్‌ లైన్‌ కూడా విధించింది. అయితే.. చంద్రబాబునాయుడు ఈ విచారణ ముందుకు సాగకుండా స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ స్టే లభించింది.

దీనిపై మేనేజ్‌ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరంటూ జగన్‌ వ్యాఖ్యానించారు. అయితే జగన్‌ ను ఎలాగోలా ఇరికించాలని నిత్యం కాసుకుని ఉండే తెలుగుదేశం నాయకులు.. ఆ వ్యాఖ్యలు ''న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేయడం'' అనే అర్థంలో జగన్‌ అన్నారని, తద్వారా న్యాయవ్యవస్థను అగౌరవపరిచారని, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని.. మోకాలికి బోడిగుండుకి ముడిపెడుతూ.. జగన్‌ ను బద్నాం చేయాలని చూస్తున్నారనేది జనం భావన. నిజానికి ''చంద్రబాబు మేనేజ్‌ చేయడం'' అనే మాట.. హైకోర్టులో స్టేకు అప్లయి చేసేలా తన యంత్రాంగాన్ని మేనేజ్‌ చేయడంలో అనే అర్థంలో కూడా ఉండొచ్చు కదా.. పని గట్టుకుని కోర్టు ధిక్కారం కింద రంగుపులమడం మరీ అతిగా ఉన్నదంటూ జనం యనమల వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News