విలువ‌ల పాఠాలు చెప్పే త‌మ్ముళ్ల‌కు ఆ ద‌మ్ము లేదా?

Update: 2017-08-05 06:41 GMT
నిద్ర లేచింది మొద‌లు విలువ‌ల మాట‌లు చెబుతూ ఉద‌ర‌గొట్టే తెలుగు త‌మ్ముళ్ల‌కు ఏపీ ప్ర‌జ‌లు వేస్తున్న ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌టం లేదు. ఏపీ విప‌క్ష నేత‌ను అదే ప‌నిగా తిట్టేసే త‌మ్ముళ్లు.. తాము ఎలాంటి త‌ప్పు చేయ‌ట‌న్లు మాట్లాడుతుంటారు. ఒక‌వేళ అదే నిజం అనుకుంటే.. ఏపీ ప్ర‌జ‌లు ప‌లువురు వారికి వేస్తున్న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎందుకు చెప్ప‌టం లేద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌ని ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ.. ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌జావాణిని ప్ర‌తిబింబించేలా మాట్లాడిన విప‌క్ష నేత జ‌గ‌న్ మాట‌ల్లో ఏదేదో అర్థాన్ని వెతుకుతున్న వారికి సూటి ప్ర‌శ్న ఒకటి ఎదుర‌వుతోంది. ఒక‌పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని అధికార‌పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. విలువ‌ల‌కు పుట్టినిల్లు లాంటి టీడీపీ.. వేరే పార్టీకి చెందిన ఎంగిలి మెతుకుల కోసం ఎందుకంత తాప‌త్ర‌య‌ప‌డుతోంద‌న్న‌ది ప్ర‌శ్న‌.

నైతిక విలువ‌ల గురించి మాట్లాడే ముందు మ‌నం ఎంత‌వ‌ర‌కూ పాటిస్తున్నామ‌న్న ప్రాధ‌మిక ప్ర‌శ్న‌ను వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తెలంగాణ‌లో త‌మ పార్టీకి చెందిన నేత‌ల్ని అక్క‌డి అధికార‌ప‌క్షం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో త‌మ‌లో క‌లిపేసుకుంటే గ‌గ్గోలు పెట్టిన తెలుగు త‌మ్ముళ్ల‌.. ఏపీలో అలాంటి దుర్మార్గ‌పు ప‌నినే తాము ఎందుకు చేసిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌ను ఎందుకు వేసుకోర‌న్న‌ది అస‌లు సందేహం.

విలువ‌లు ఎక్క‌డైనా ఒకేలా ఉండాలే కానీ.. ఏపీలో ఒక‌లా.. తెలంగాణ‌లో మ‌రోలా ఉండ‌కూడ‌దు క‌దా? మ‌రి.. అలాంట‌ప్పుడు తెలంగాణ‌లో త‌మ పార్టీ ఎమ్మెల్యేల్ని.. ఎంపీల్ని గులాబీ బాస్ కారు ఎక్కించుకున్నార‌ని తెగ ఫీలైపోతున్న వారు.. ఏపీలో ఫ్యాన్ కింద కూర్చున్న వారిని తీసుకొచ్చి ప‌చ్చ సైకిల్ మీద ఎలా ఎక్కిస్తార‌న్న సూటి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు చెప్ప‌న‌ట్లు?

అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌క‌పోతే చెప్ప‌క‌పోయారు. క‌నీసం.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి తీసుకెళ్లిన 21 మంది జంప్ జిలానీల చేత రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నిక‌ల్లో గెలిపించుకోవచ్చుగా అన్న స‌వాలుకు ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేని పరిస్థితి. అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చిన నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలోనే కిందామీదా ప‌డుతున్నఏపీ అధికార‌పక్షానికి 21 మంది క‌ప్ప‌దాటు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి ఎన్నిక‌ల బ‌రిలో దిగే ద‌మ్ముందా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. అదే ప‌నిగా మాట్లాడే బ‌దులు.. ద‌మ్ముగా రాజీనామా లేఖ‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించి.. ఎన్నిక‌ల బ‌రిలో నిలుచుంటే ఎవ‌రి ద‌మ్ము ఏమిట‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. అంత ద‌మ్ము తెలుగు త‌మ్ముళ్ల నుంచి ఆశించొచ్చా?

Tags:    

Similar News