పోలవరాన్ని ముంచిన టిడిపి అవినీతి?

Update: 2019-09-20 06:10 GMT
గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ ను నత్తనడకనసాగించడం వెనుక ఆ పార్టీ ముఖ్యనేతలు సొమ్ము చేసుకోవడమే ప్రధాన కారణం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్‌ ను అడ్డం పెట్టుకుని తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి నాటి అధికారనాయకులు ప్రాధాన్యత ఇచ్చారే గానీ పనులు వేగవంతం చేసి రాష్ట్రానికి త్వరితగతిన ప్రయోజనం అందించేందుకు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదని స్పష్టమవుతోంది. గత చంద్రబాబు పాలన లో ఈ ప్రాజెక్ట్‌ పనుల్లో 2400 కోట్ల అక్రమ చెల్లింపులు - అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి నిపుణు కమిటీ తేల్చింది. మొత్తం చెల్లింపుల్లో అంతమొత్తం అక్రమాలు జరిగాయంటే అందులో ఎంత మొత్తం నాటి ప్రభుత్వంలోని పెద్దలకు - ముఖ్యులకు చేరిందనేది తదుపరి దర్యాప్తులో గానీ బయటపడే అవకాశం లేదు. ఈ ప్రాజెక్ట్‌ ను తమస్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారని నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అర్థం అవుతుంది.

ముడుపుల కోసమే కేంద్రం నుంచి రాష్ట్రానికి పని...

అసు ఈ ప్రాజెక్ట్‌ ను కేంద్రం ప్రభుత్వమే పూర్తి చేయాలి. దేశంలోఇంతవరకు జాతీయ ప్రాజెక్ట్‌ లన్నీ కేంద్రమే త్వరితగతిన పూర్తిచేసింది. కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీజెపికి మిత్రపక్షంగా ఉండేది. ఫలితంగా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేసి ఈప్రాజెక్ట్‌ అమలును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించే విధంగా అంగీకారం కుదిరింది. దీనివల్ల కేంద్ర  ప్రభుత్వం సులభంగా భారాన్ని తగ్గించుకుంది. ఇందుకోసం నిర్మాణ పనులకు మాత్రమే నిధులు చెల్లిస్తామని మిగిలిన భూసేకరణ - పునరావాసం తదితర పనులు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇందుకు చంద్రబాబు అప్పట్లో ఒప్పుకోవడం వెనుక పనుల ద్వారా తాను - తమ వారు లబ్ధిపొందాలని ప్రాజెక్ట్‌  ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. పనులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయించి ఉంటే సహజంగానే భూసేకరణ - పునరావాసం భాద్యత కూడా  కేంద్రం పైనే ఉండేది. ఈవిధంగా నష్టం జరగడం వెనుక నాటి ప్రభుత్వ పెద్దల అవినీతే కారణం. పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే తద్వారా తమ వారు సబ్‌ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి లాభపడతారని - ప్రత్యక్షంగా బిల్లులు చెల్లింపులలో తమ చేతివాటం ప్రదర్శించవచ్చనే ఉద్దేశ్యంతో మొత్తం ప్రాజెక్ట్‌ నే ముంచేశారు.  ఈ విధంగా నేటి సంక్షోభానికి పూర్తిగా నాటి పాలకులే కారణం. 

ఆరోపించినా ప్రధాని దర్యాప్తు జరిపించకపోవడం వెనుక...

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు నత్తనడకన జరగడమే కాకుండా అక్రమాలు - అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతోనే కొత్తం ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో అధ్యాయనం చేయించింది. ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్ట్‌ ను తెలుగుదేశం ప్రభుత్వం - నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏటీఎంగా మారిందని - ఈ ప్రాజెక్ట్‌ ను అడ్డం పెట్టుకుని సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాని నరేంద్రమోడి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించగా ఆ కమిటీ ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించే విధంగా నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలు పరిశీలిస్తే నాటి ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్ట్‌ ను ఏటీఎంగా వాడుకుందనే అభిప్రాయం కలగకమానదు. ప్రాజెక్ట్‌ పనులు ఓ వైపు నత్తనడకన నడుస్తూ రైతులకు ప్రయోజనాలు అందించడంలో ఆలస్యం అవ్వడమే కాకుండా అదే అదునుగా వ్యయాలను పెంచుకుంటూ - త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు అదనపు చెల్లింపులు అవసరం అంటూ ప్రభుత్వం అప్పట్లో ఇష్టానుసారం బిల్లులు చెల్లించింది. అందుకు అడ్డం వచ్చిన నియమ నిబంధనలను క్యాబినెట్‌ తీర్మానాల పేరుతో తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రాజెక్ట్‌ లో ప్రధానమైన పనులను నేరుగా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించింది. వేల కోట్లరూపాయలు ఈ విధంగా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించినా ఎవ్వరూ నోరు మెదపలేదు. తమ వారికి ప్రయోజనం చేకూరుతోందని ఎల్లో మీడియా పరోక్షంగా - ప్రత్యక్షంగా మద్దతు పలికింది. దేశంలో ఎక్కడాలేని విధంగా వేలకోట్ల రూపాయల పనులను ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి తప్పించి తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌ కు అప్పగించడం నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమయ్యింది. అప్పట్లో కేంద్రం ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకుంటున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించిన ప్రధాని - ఆయన నేతృత్వంలోని కేంద్రప్రభుత్వమే అందుకు సహకరించిందనే విషయాన్ని విస్మరించారు. అప్పుడైనా - ఇప్పుడైనా నాటి ప్రభుత్వం అక్రమాలపై విచారణజరిపించే అధికారం కేంద్రం ప్రభుత్వానికి ఉంది.

ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్‌ ను కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌ గా గుర్తించి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నందున పనుల్లో అక్రమాలు - చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ జరిపించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి ప్రయత్నమే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీని వేదికలో కళ్లు బైర్లు గమ్మే అక్రమాలు వెలుగు చూసినా కేంద్రం మాత్రం పరోక్షంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బీజెపి లో చేరిపోయారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు.

తద్వారాఎగువసభలో బీజెపి బలం పెరిగింది. కేంద్రం నుంచి ఎటువంటి సమస్యలు - ఐటీ - ఈడీ - సీబీఐ లాంటి దార్యప్తు సంస్థలు తనవైపు చూడకుండా ఉండేందుకే ఎంపీలను చంద్రబాబు తెలివిగా బీజెపిలో చేర్చారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగిన విధంగానే కేంద్రం కూడా పోలవరం అక్రమ చెల్లింపులపై నోరు మెదపడం లేదు. పైగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులు వేగవంతం చేసి ప్రభుత్వంపై భారం తగ్గించడం ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేసేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు.

టిడిపి నేతలే బీనామీ కాంట్రాక్టర్లు...

పోలవరం ప్రాజెక్ట్‌లో పాత ఎస్‌ ఎస్‌ ఆర్‌ ప్రకారమే బిల్లులు చెల్లించాలి. కానీ 2015-16 ఎస్‌ ఎస్‌ ఆర్‌ ను పరిగణలోకి తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై రూ. 1331 కోట్ల భారం పడింది. అదే విధంగా ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి రాబట్టాల్సిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లపై వడ్డీ 84.43 కోట్లు ఇంతవరకు వసూలు చేయలేదు. చిల్లర ఖర్చు కింద కాంట్రాక్టర్‌ కు ఏకంగా 142 కోట్లు చెల్లించారంటే విస్తు కలుగుతోంది. ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అన్ని పనుల్లోనూ మొత్తంగా 2400 కోట్లు అదనంగా చెల్లించారు. వీటన్నింటికీ గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరు పడ్డ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కు సన్నిహిత కంపెనీగా పేరు పడ్డ త్రివేణీ సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ - ఇన్‌ ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు వందల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఆర్ధిక మంత్రి యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం ఆఘమేఘూల పై క్లియర్‌ చేసేవారు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు పోలవరం  ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌ లో రూ. 142 కోట్ల విలువైన పనులు - 179 కోట్లు ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ నేత ఋలుసు సుధాకరరావు కు అప్పగించారు. ఇక చంద్రబాబు బినామీ ఎంపీ సీఎం రమేష్‌ (ప్రస్తుతం ఈయన బీజెపిలో ఉన్నారు) ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్‌ వర్క్స్‌ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు - ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య కు చెందిన బీఎస్‌ పీసీఎల్‌ కంపెనీకి అప్పగించారు. ఈ  పనలు విలువ 286 కోట్లు. సూర్య కన్‌ స్ట్రక్షన్స్‌ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేనిపరిస్థితి. పోలవరం ప్రాజెక్టులో ఆది నుంచి అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులు ఇస్టానుసారంగా చేశారని - మట్టి పనిని ఎం బుక్‌ లో రికార్డ్‌ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

నాణ్యత పరీక్షించకుండానే బిల్లులు చెల్లింపుల వెనుక మర్మం...

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన  మెటీరియల్‌ మొదలైన వాటి నాణ్యత పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేసింది. అయితే నిబంధనల ప్రకారం అక్కడ నాణ్యత పరీక్షలకు లేబరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్న అలా చేసినట్లు ఆధారాలు  ఎక్కడా లేవు. లేబరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది.  సిమెంట్‌ - ఇతర మెటీరియల్‌ కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసి బిల్లులు శాఖా పరంగా చెల్లించారు. ఈ చెల్లింపులు కాంట్రాక్టర్‌ నుంచి తరువాత రాబట్టినా ఇది ప్రభుత్వ విధానం - ఒప్పంద నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ ప్రాజెక్ట్‌ లో గత ప్రభుత్వం అవినీతి ఎంతలా చేసిందంటే ఎస్‌ ఈ ని కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన కిచెన్‌ ఇన్‌ ఛార్జిగా చూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్‌ గా చెల్లించారు. ఇదో ఉదాహరణ. వీక్ లీ రేషన్‌ కు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ లు చెల్లించారు. 2017 సెప్టెంబర్‌25న 44,23,981 అడ్వాన్స్‌ గా చెల్లించారు. మెటీరియల్‌ కు అడ్వాన్స్‌ చెల్లించారు. డీజిల్‌ కొనుగోలు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్‌ కు రివాల్వింగ్‌ ఫండ్‌ కింద ప్రత్యేకంగా చెల్లించారు. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ ట్రాయ్‌ నుంచి ఇంప్రెస్ట్‌ అకౌంట్‌ ద్వారా రూ. 144.22 కోట్ల బకాయిలు ఉన్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు న్యాయపరంగా జలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. ఆర్‌ ఆర్‌ చట్టం ద్వారా రికవరీ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారాన్ని  అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసిన పోలవరం దందాలో  నిబంధనలు ఉల్లంఘన - దోపిడీకి ఇవి కొన్నిఉదాహరణలు మాత్రమే.
Tags:    

Similar News