బీజేపీపై టీడీపీ కాక పెరుగుతోంది

Update: 2016-07-29 17:30 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించే విష‌యంలో టీడీపీ గ‌ట్టి ప‌ట్టు మీదే ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి మిత్ర ప‌క్షంగా ఉన్న బీజేపీపై  ఆచి తూచి మాట్లాడిన టీడీపీ ఎంపీలు.. రానురాను కాక పెంచుతున్నారు. ఏపీకి హోదా విష‌యంలో కేంద్రం గ‌తంలో మాట‌లు మార్చిన‌ప్ప‌టికీ.. ఒకింత బ్యాలెన్స్‌గానే మాట్లాడిన టీడీపీ ఎంపీలు - కేంద్ర మంత్రులు.. తాజాగా, రాజ్య‌స‌భ‌లో కేవీపీ ప్రైవేటు బిల్లుపై బీజేపీ అనుస‌రించిన వైఖ‌రితో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వీరికి టీడీపీ అధినేత - సీఎం చంద్ర‌బాబు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న‌టికి మొన్న కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా సుజ‌నా చౌద‌రి హోదా విష‌యంలో కేంద్రంపై విరుచుకుప‌డ్డారు.

ఏపీకి ఏదో ఇస్తున్న‌మ‌ని చెబుతున్నారుగా.. ఏమిస్తున్నారో.. లెక్క‌ల‌కు సిద్ధ‌మా అని స‌వాలు కూడా విసిరారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా కాక పుట్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో సౌమ్యంగా ఉన్న సుజ‌నా కేంద్రంపై ఫైర‌వ‌డం ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ధానంగా వ‌చ్చింది. ఇక తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా కేంద్రంపై ఫైర‌య్యారు. ఎంత‌లా ఫైర‌య్యారంటే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో త‌మ‌కు కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా .. ఒక‌టే అనేశారు.  రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలపై పోరాడుతున్నామని,వాటి సాధనే త‌మ‌కు ప్ర‌ధానమ‌ని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎంత జరగదన్నది ముఖ్యం కాదని, గ‌త ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు.

ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మ‌నోహ‌ర్‌ నాయుడు సైతం ఈ అంశంపై చ‌ర్చ‌కు నోటీసు ఇచ్చి హోదాపై తాము పోరాటానికి  రెడీ అని స్ప‌ష్టం చేశారు. ఇక అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ కూడా కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో టీడీపీ - బీజేపీల మ‌ధ్య మిత్ర‌త్వం సాగుతుందా? అనే డౌటు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తే.. చెప్ప‌లేం కానీ, అలా కాక‌పోతే, రాజ‌కీయంగా టీడీపీకి ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో తెగ‌తెంపులు చేసుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రేం జ‌ర‌గ‌నుందో చూద్దాం.
Tags:    

Similar News