బాబు త‌ప్పుల్ని ఎత్తి చూపించిన త‌మ్ముళ్లు!

Update: 2019-06-15 06:10 GMT
ఎన్నో ప‌నులు చేశాం. మ‌రెన్నో ప‌థ‌కాలు అమ‌లు చేశాం. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుండ‌కున్నా ఎవ‌రికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాం. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చేయ‌టం కోసం టీడీపీ అధినేత‌.. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్నికావు. చివ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌సుపు కుంక‌మ ప‌థ‌కాన్ని ఓపెన్ గా ప్ర‌స్తావిస్తూ.. మీరు ఓటు వేయ‌టానికి తానిస్తున్న మొత్తం ఇంత అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన వైనాన్ని మ‌ర్చిపోలేరు. ఓట్ల కోసం మ‌రీ ఇంత‌లా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అన్న విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోకుండా.. ఓట్లే ధ్యేయంగా సాగిన బాబు ఎత్తుల్ని తిప్పి కొట్టారు ఏపీ ప్ర‌జ‌లు.

ప్ర‌జ‌ల‌కు తాయిలాల విష‌యంలో ఎలాంటి తేడా రాకుండా చేసిన‌ప్ప‌టికీ..రెండోసారి ప‌వ‌ర్ ఇచ్చేందుకు ప్ర‌జ‌లు ఎందుకు రెఢీ కాలేద‌న్న విష‌యం బాబుకు అర్థం కావ‌ట్లేదు. ఓట‌మి ఎదురై ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర నెల‌కు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం ఇప్పటికి అందులోని నుంచి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. పార్టీ ఎందుకు ఓడిందో త‌న‌కు ఇప్ప‌టికి అర్థం కావ‌ట్లేదంటూ ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ బాబు నోటి రావ‌టం క‌నిపిస్తుంది. తాజాగా పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా.. ఓట‌మికి కార‌ణాలు చెప్పాలంటూ కోరిన నేప‌థ్యంలో మొహ‌మాట‌పు ప‌రదాల్ని తీసేశారు తెలుగు త‌మ్ముళ్లు.

అధినేత చేసిన త‌ప్పుల చిట్టాను ఎవ‌రికి వారు చెప్పుకొచ్చారు. మొన్న‌టివ‌ర‌కూ ఆహా.. ఓహో అన్న నేత‌ల నోటి నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల వ‌ర్షాన్ని చూస్తుండిపోయారు చంద్ర‌బాబు.

ఓట‌మి లోపాలు చెప్పే వేళ‌.. నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయాన్ని ప‌లువురు త‌మ్ముళ్లు వినిపించిన‌ట్లుగా తెలుస్తోంది. వేలాది మందిని ఒకేసారి లైన్ లోకి తీసుకొని టెలికాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హించ‌టం స‌రికాద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు అభిప్రాయ‌ప‌డ్డారు. వేలాది మందితో ఒకేసారి మాట్లాడ‌టం వ‌ల్ల కొన్నిసార్లు నేత‌లు త‌మ అభిప్రాయాల్ని ఓపెన్ గా చెప్ప‌లేర‌న్నారు.

జ‌గ‌న్ నీతివంత‌మైన పాల‌న అందిస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఆయ‌న చెప్పిన‌ట్లు నీతివంత‌మైన పాల‌న‌ను అందిస్తే ఓకే. కానీ.. టీడీపీ నేత‌ల్ని అవినీతిప‌రులుగా చిత్రీక‌రిస్తున్నారు. ప‌వ‌ర్లోకి వ‌చ్చిన రోజు నుంచి అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ దాడిని స‌మ‌ర్థంగా తిప్పి కొట్టాల‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు చెప్పారు.

పార్టీ అధినేత చంద్ర‌బాబును స్వేచ్ఛ‌గా క‌లిసే వీలు లేకుండా పోయింద‌ని.. పార్టీలో రాన్నాను.. మాన‌వ సంబంధాలు లోపిస్తున్నాయ‌ని జూపూడి వెల్ల‌డించారు. టీడీపీ నేత‌ల‌పై కేసులు పెడితేనే పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుద‌ల చేస్తామ‌ని టీడీపీ కార్య‌ర్త‌ల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు బెదిరిస్తున్నార‌న్నారు.

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి అడ్డుప‌డ్డ‌ట్లుగా బాబు చుట్టూ ఉన్న వారు ఎవ‌రిని అధినేత ద‌గ్గ‌ర‌కు రాకుండా చేస్తున్నార‌ని.. ఈ తీరు మార్చుకోవాల‌న్నారు. అధినేత‌కు వాస్త‌వాలు చెప్పే అవ‌కాశం ఉండాల‌న్నారు. కోడెల కుటుంబ స‌భ్యుల వ్య‌వ‌హారాల‌న్నీ తెలిసిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కే మ‌ళ్లీ టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తామ‌ని అనుకున్నారంటూ ఒక‌నాటి సినీన‌టి.. తాజా టీడీపీ మ‌హిళా నేత దివ్య‌వాణి ప్ర‌శ్నించారు.

టీడీపీ నేత‌ల‌పై దొంగ కేసులు పెడుతున్నార‌ని.. అర్జెంట్ గా టీడీపీ లీగ‌ల్ విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్నారు. పార్టీ నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్న విష‌యాన్ని పార్టీ పెద్ద‌లు గుర్తించ‌లేద‌న్న విమ‌ర్శ వినిపించింది. ఆర్టీజీఎస్ నివేదిక‌లే కొంప ముంచిన‌ట్లుగా ప‌లువురువ్యాఖ్యానించారు. గ్రామాల్లో నేత‌ల అవినీతిపై అధినేత‌కు చెప్పే అవ‌కాశం లేకుండా చేశార‌న్నారు.

బాబు చుట్టూ చేరిన  బృందం అధినేత‌కు వాస్త‌వాలు తెలీకుండా చేశార‌ని.. కార్య‌కర్త‌ల‌కు.. నాయ‌కుల‌కు చంద్ర‌బాబు దూర‌మ‌య్యార‌న్న మాట‌ను చెప్పారు. చాలా రోజుల త‌ర్వాత త‌మ క‌డుపులో దాచుకున్న అసంతృప్తిని బాబు ముందు క‌క్కేసిన త‌మ్ముళ్లు కాస్తంత రిలాక్స్ అయ్యార‌ని చెప్పాలి. కాకుంటే మొన్న‌టివ‌ర‌కూ నేత‌ల్లో ఒక యాంగిల్ చూసిన చంద్ర‌బాబుకు.. తాజా వ్య‌వ‌హారం మ‌రో కోణాన్ని ఆయ‌న‌కు గుర్తు చేసేలా చేసింద‌ని చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News