బాబు ఇంటి ముందు త‌మ్ముళ్ల నిర‌స‌న‌

Update: 2017-02-28 05:42 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై ఆ పార్టీ నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల తరుపున పోటీచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను విష‌యంలో పార్టీకోసం క‌ష్ట‌ప‌డ్డ వారికి కాకుండా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే పెద్ద పీట వేశార‌ని ఆరోపిస్తున్నారు. ఏకంగా పార్టీ అధినేత ఇంటి ముందే నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా చివరి నిముషం వరకూ పేర్లు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే అధికారపార్టీ నాయకత్వం తీరుపై జిల్లా నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

తూర్పు గోదావరి - శ్రీకాకుళం - నెల్లూరు జిల్లాల అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వం మండిపడుతోంది. తూర్పుగోదావరిలో చిక్కాల రామచంద్రరావు - నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డిపై అక్కడ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని నామినేషన్‌ కు సిద్ధం చేయడం, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలను పిలపించడం వంటి బాధ్యతలన్నీ జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రులకు అప్పగించారు. ముందుగా అభ్యర్థుల వివరాలను జిల్లాల్లోనే ప్రకటించాల్సిగా ఇన్‌ ఛార్జి మంత్రులకు సూచించారు. అక్కడ వాతావరణాన్ని బట్టి తాను ఫైనల్‌ లిస్టు ప్రకటిస్తానని తెలిపారు. శ్రీకాకుళంలో శత్రుచర్ల ప్రకటన రాగానే వ్యతిరేకవర్గం ఎదురుతిరిగింది. పార్టీని నమ్ముకున్న వారికి ఇవ్వకుండా బయట నుండి వచ్చిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పశ్చిమ గోదావరి అభ్యర్థి వ్యవహారం తేలకపోవడంతో బాధ్యత సీఎంపై పెట్టి మంత్రి అయ్యన్నపాత్రుడు వెళ్లిపోయారు. నెల్లూరులో వాకాటి - ఆదాల ప్రభాకరరెడ్డి గ్రూపు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన నెక్కంటి బాలకృష్ణ అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి సీటు బాలకృష్ణకు ఇవ్వాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు నెట్టివేశారు. తాము పార్టీని నమ్ముకుని ఉంటే తమకు ఇవ్వకుండా వేరే వాళ్లకు సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అధికారిక ప్రకటనను నిలిపేశారు. అన్ని జిల్లాల్లోనూ ప్రకటనలు ఆపేయాలని ఆదేశించారు.

మ‌రోవైపు అభ్య‌ర్థుల వివరాలను అర్థరాత్రికి ఒక్కొక్కటిగా వెల్లడించారు. చిత్తూరు స్థానిక సంస్థల నుండి దొరబాబు - నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి - తూర్పు గోదావరి నుండి చిక్కాల రామచంద్రరావు - శ్రీకాకుళం నుండి శత్రుచర్ల విజయరామరాజు - కడప నుండి బిటెక్‌ రవి - కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. పశ్చిమగోదావరి - అనంతపురం అభ్యర్థుల ప్రటకనను వాయిదా వేశారు. పశ్చిమగోదావరిలో అభ్యర్థిత్వం తేలకపోవడంతో ప్రకటన బాధత్యను సీఎంపై నెట్టేసి ఇన్‌ ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు అక్కడ నుండి వెళ్లిపోయారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News