వేటు వేశాక రోజా మీద అంత చర్చ ఎందుకు..?

Update: 2015-12-23 05:08 GMT
ఏపీ అసెంబ్లీలో కాస్తంత విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా రెడ్డిని ఏడాది పాటు సస్పెండ్ చేసిన రెండు రోజుల తర్వాత ఆ అంశంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరగటం గమనార్హం. శీతాకాల సమావేశాలు ముగిసే సమయంలో రోజాపై అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె వ్యవహరించిన తీరు.. చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షానికి చెందిన మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

రోజాపై సస్పెన్షన్ వేటు వేసిన రోజు కానీ.. ఆ తర్వాత కానీ ఈ విషయాన్ని మాట్లాడని టీడీపీ మహిళా నేతలకు మంగళవారం మాట్లాడాలని అనిపించటం ఏమిటి? వారెందుకు రోజా ఇష్యూను ప్రస్తావించారు. దీనికి అధికారపక్షానికి మిత్రపక్షమైన బీజేపీ నేత గొంతు కలిపారన్న విషయాన్ని చూస్తే.. రోజా సస్పెన్షన్ పై ఏపీ అధికారపక్షం దారుణంగా వ్యవహరించిందన్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టటమే లక్ష్యంగా కనిపిస్తోంది. తమ అధినేతను.. మహిళా ఎమ్మెల్యేలను అభ్యంతరకరంగా మాట్లాడటంతో పాటు.. రోజా అన్న మాటలు (రోజుకొకడితో పడుకునే నువ్వేంటి మాట్లాడేది?,  కామ చంద్రబాబు.. సెక్స్ ముఖ్యమంత్రి) ప్రజల్లోకి వెళ్లకపోవటం.. సస్పెన్షన్ తో రోజా మీద సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో అధికారపక్షం అలెర్ట్ అయ్యింది.

ఒక మహిళా శాసనసభ్యురాలిపై అంత అన్యాయంగా.. ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేస్తారా? అంటూ జగన్ చెబుతున్న మాటల్లో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తాము ఆమెపై అంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం.. రోజా స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా  ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే.. కాస్త ఆలస్యంగా రోజా వ్యవహరించిన తీరుపై ఏపీ అధికారపక్షం చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది.

కొసమెరుపేమంటే.. సోమవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం.. విపక్షం విరుచుకుపడుతున్నా అధికారపక్షం నేతలు పట్టనట్లుగా వ్యవహరించిన వైనంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఏపీ అధికారపక్ష నేతలు గళాన్ని విప్పటం కనిపిస్తోంది. అంటే.. ముఖ్యమంత్రికి అగ్రహం వ్యక్తం చేస్తే తప్ప అధికారపక్ష నేతలకు చురుకుపుట్టటం లేదా?
Tags:    

Similar News