‘‘చెప్పు’’ ఎపిసోడ్ ఎవరికెంత లాభం?

Update: 2016-06-04 04:20 GMT
గడిచిన రెండేళ్లలో కనిపించని దృశ్యం ఒకటి ఏపీ రాజకీయాల్లో శుక్రవారం ఆవిష్కృతమైంది. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ మండిపడటం కొత్తేం కాదు. విమర్శలు చేయటం అలవాటు లేని అంశమూ కాదు. కానీ.. ఎప్పుడూ లేని విధంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్యపై తమ్ముళ్లు రియాక్ట్ అయిన తీరు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. గతంలో మరే ఇతర విమర్శకు అంతలా రియాక్ట్ కాని వారు.. ‘మీ ఊరికి వస్తే చంద్రబాబును చెప్పుతో కొట్టండి’ అంటూ చేసిన వ్యాఖ్యపై ఏపీ తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు.

నిజానికి ఈ తరహాలో విమర్శలు చేయటం జగన్ కు కొత్త కాదు. గతంలో.. చంద్రబాబును రాళ్లతో కొట్టండంటూ జగన్ వ్యాఖ్యానించారు. అప్పుడు పెద్దగా రియాక్ట్ కాని తమ్ముళ్లు.. ‘‘చెప్పు’’ విమర్శ మీద మాత్రం తమ ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించారు. చంద్రబాబును జగన్ విమర్శించటం.. అది పెద్దగా ఫోకస్ కాకపోవటం జరిగే క్రమానికి భిన్నంగా తాజా ‘చెప్పు’ మాట మీడియాలో బాగా ఫోకస్ అయ్యింది.

గురువారం మొదలుకొని శుక్రవారం సాయంత్రం వరకూ ఏపీ తమ్ముళ్లను ఎవరిని కదిలించినా.. ఎవరికి వారు జగన్ ను తిట్టటంలో తామే ముందుండాలన్నట్లుగా ఫీల్ కావటంతో మీడియాలో వీరి మాటలే ప్రముఖంగా కనిపించిన పరిస్థితి. నిజానికి ఇలాంటి పరిస్థితికి కారణం అనంతపురం తెలుగుదేశం నేతలుగా చెప్పాలి. ప్రస్తుతం జగన్ అనంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యపై ఆ జిల్లా నేతలు ఘాటుగా స్పందించారు. దీనికి మీడియాలో ప్రచారం భారీగా లభించటంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కెమేరాల ముందు జగన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ జగన్ కు లాభించిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఫీల్ అవుతుంటే.. జగన్ కు దిమ్మ తిరిగేలా తాము ఎదురుదాడి చేశామని టీడీపీ నేతలు ఫీల్ కావటం గమనార్హం. ఇక.. సాపేక్షంగా చూస్తే.. ఈ ఎపిసోడ్ లో ఎవరు ముందున్నారు..? ఎవరు దూకుడుగా వ్యవహరించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకటం అనవసరమనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే విలువలు తగ్గిన రాజకీయం.. ‘చెప్పు’ ఎపిసోడ్ తో మరింత దిగజారిందని చెప్పాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏమాత్రం మర్యాద.. గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు చేయగా.. తాము మాత్రం ఏం తక్కువ తినలేదన్నట్లుగా అధికారపక్ష నేతలు సైతం ప్రతిపక్ష నేతపై భారీ మాటల దాడి చేయటం మర్చిపోకూడదు. రాజకీయంగా విమర్శలు సహజం. కానీ.. ఈసారి మాత్రం ఇరుపక్షాలు తమ గీత దాటి వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చిన తీరు చూస్తే..రానున్న రోజుల్లో మాటల దాడి మరింత జగుప్సాకరంగా మారటం ఖాయమనే చెప్పాలి.
Tags:    

Similar News