వైసీపీ అక్రమాలపై పార్లమెంట్ లో గళమెత్తిన గల్లా జయదేవ్ !

Update: 2020-02-04 10:14 GMT
ప్రస్తుతం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చి తన గళాన్ని వినిపించారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా జరిగిన ఛలో అసెంబ్లీ సందర్భంలో జరిగిన సంఘటనను లోక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. తనపై భౌతిక దాడి జరిగిందని దీనికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు.

అలాగే ఇదే సమయంలో మీడియాలో వచ్చిన కథనాలను కూడా ఆధారాలుగా అయన స్పీకర్‌ కు సమర్పించారు. అలాగే తన అరెస్ట్‌ ను, పోలీసులు తనను ఇబ్బందులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ గల్లా జయదేవ్ పూసగుచ్చినట్టు లోక్ సభలో వివరించారు. వైసీపీ ఎంపీల ముందే ఏపీలో ప్రభుత్వ అరాచక పాలనపై ఆయన గళమెత్తడం గమనార్హం.

రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా , ప్రజా ప్రతినిధిగా వారి ఉద్యమానికి మద్దతు తెలపడం తన బాధ్యతని అందుకే చలో అసెంబ్లీకి వారికి మద్దతు తెలపడానికి వెళ్లానని, అయితే ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని తెలిపారు. ఏపీలోని వైస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకుందని, శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తున్నా పోలీసులే ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి దాడికి దిగారని ఆరోపించారు.

తనను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడెక్కడో గాయపరిచారని, ఎక్కడ తిప్పుతున్నారో కూడా చెప్పకుండా తనను 13 గంటల పాటు ప్రతీ ఊరు తిప్పారని మండిపడ్డారు. అలాగే ఆ సమయంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని , ఒక ఎంపీ అని కూడా చూడకుండా నా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తన చొక్కా చించి వేశారని తెలిపారు. అంతే కాదు తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అలాగే అమరావతిలో రాజధాని ఉంచాలంటూ గత 49 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా...వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని గల్లా జయదేవ్‌ లోక్‌ సభలో తన వాణిని వినిపించారు.
Tags:    

Similar News