సరిగ్గా మూడేళ్లకు.. జనవరిలో ఆగనున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం జనవరితో ఓ కొలిక్కి రానుందా? ఈ మేరకు సూచనలు కనిపిస్తున్నాయి.
2022 ఫిబ్రవరి 24న మొదలైంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. అంటే సరిగ్గా 21 నెలలు.. తమ సరిహద్దులోని ఉక్రెయిన్.. అమెరికా కనుసన్నల్లో నడిచే నాటో కూటమిలో చేరాలనుకోవడంతోనే రష్యా కన్నెర్ర చేసింది. తొలుత సైనిక చర్య అని మొదలుపెట్టింది.. ఉక్రెయిన్ ను నిస్సైనీకరణ చేయడమే లక్ష్యంగా పేర్కొంది. కానీ, చివరకు పూర్తి స్థాయి యుద్ధంగా మార్చింది. కొందరు భారత యువకులను ఉద్యోగాల పేరిట నియమించుకుని ఉక్రెయిన్ యుద్ధంలో దింపింది. ఇప్పుడు ఉత్తర కొరియా సైనికులనూ ఉక్రోయిన్ పై యుద్ధానికి సాయంగా తీసుకుంటోంది. అటు ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సాయంతో రష్యాపై పోరాటం సాగిస్తోంది. మొత్తానికి యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరి దీనిని ఆపేదెవరు?
జనవరి తర్వాత శుభ సూచకం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం జనవరితో ఓ కొలిక్కి రానుందా? ఈ మేరకు సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఆయన తాను అధికారంలో వచ్చిన వారం రోజుల్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసేలా చేసి పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ట్రంప్ ప్రాధామ్యంలో..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం ట్రంప్ ప్రాధామ్యాల్లో ఒకటిగా ఉంది. తమ ప్రభుత్వం ఈ దిశగా దృష్టిసారిస్తుందని చెప్పారు. ఈ యుద్ధంపై నివేదికను పరిశీలించగా వేలాదిమంది మరణించారని విచారం వ్యక్తం చేశారు. 10 రోజుల కిందట ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అనంతరం మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడుకుంటూ అక్రమ వలసలను నివారిస్తామని ట్రంప్ అన్నారు. సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ థింక్-ట్యాంక్‌లో ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ లిసా కర్టిస్ చెబుతున్నదాని ప్రకారం.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ పలుమార్లు హామీ ఇచ్చారని.. ఆయన ఏం చెయ్యబోతున్నారనేది ఆసక్తికరం అని పేర్కొన్నారు. గతంలో ట్రంప్ డిప్యూటీ అసిస్టెంట్ గా పనిచేశారు కర్టిస్.
పుతిన్ కు చెప్పగల నేత
అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాననడం ట్రంప్ గొప్పలు కాదు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పగల స్థాయి ఉన్న నాయకుడు. ఇప్పటికే పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరారు. అధికారం చేపట్టాక నేరుగా చర్చలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ పెడితే ఫిబ్రవరిలో ఆగే అవకాశం ఉంది. లేదంటే మరొక రెండు నెలలు పట్టొచ్చు. మొత్తానికి తొందరలోనే ముగింపును ఆశించవచ్చు.