నవ్వుతున్నారు సార్‌..మిమ్మల్ని చూసి

Update: 2019-01-07 11:04 GMT
పోరాటం అంటే ఎలా ఉండాలి..? పోరాడేవాడిని చూసి నరాలు ఉప్పొంగాలి. మనం కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములమవుదాం అనే భావన కలగాలి. కానీ పోరాటం చేస్తుంటే.. చూసినోళ్లు నవ్వుకోకూడదు కదా. అదే జరుగుతోంది ఢిల్లీలో. ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు.. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నంత కాలం ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు జరుపుతూనే ఉంటారు. అన్నింటికి మించి చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ హైలెట్‌ అవుతారు ఈ ప్రదర్శనల్లో.

రోజుకో వేషధారణతో.. అందరిని ఎంటర్‌ టైన్ చేస్తుంటారు ఎంపీ శివప్రసాద్‌. ఇప్పటివరకు ఆయని వేయని వేషం లేదు. ఆయన ఫిజిక్‌ కు సూటయ్యే అన్ని పాత్రల్ని ఆయన వేసేశారు. శివప్రసాద్‌ సినిమా ఆర్టిస్ట్‌. దాదాపు 30 ఏళ్లనుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనకు సినిమా అంటే ప్రాణం. అందుకే.. తనకు బాగా తెలిసిన సినిమా భాషలోనే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడుతున్నారు. ఆయన భావం మంచిదే - కానీ ఆయన ఎంచుకున్న విధానమే సరికాదని చాలామంది అభిప్రాయం. పార్లమెంట్‌కు వచ్చేవాళ్లు - పోయేవాళ్లు - మిగిలిన ఎంపీలు - అధికారులు.. శివప్రసాద్‌ ని చూసి.. ఏదో మ్యాజిక్‌ జరుగుతుందని ఫీల్‌ అవుతున్నారు తప్ప.. అక్కడ ఒక ఎంపీ.. తమ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నారని ఎవ్వరూ అనుకోవడం లేదు.

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎలా నడిపారో అందరూ చూశారు. మొన్నటికి మొన్న తమిళనాడు - మహారాష్ట్ర రైతులు తమ ఉద్యమ తడాఖాను ఎలా చూపించారో అందరికి తెలుసు. ఆ విధంగా ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. ఇలా పగటి వేషగాళ్లలా రోజుకో వేషం వేసుకుంటే ఎవరు చూస్తారు సార్‌ అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు. వెనుకున్న ఎంపీలు నవ్వుతుంటారు - ముందున్న శివప్రసాద్‌ కామెడీ చేస్తుంటాడు అంటూ ఇప్పటికే జోక్‌ లు పేలుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోయినా ఫర్వాలేదు.. ఏపీ ప్రజలు పరువుని పార్లమెంట్‌ సాక్షిగా తీయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News