రాజ్యసభలో పీకలేంది లోక్ సభలో పీకినా..

Update: 2016-07-31 05:08 GMT
అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడిచిపెట్టేలా లేరు. ఏపీ ప్రత్యేక హోదా అంశం రాష్ట్రానికి ఎంత కీలకమన్న విషయం ఆయనకు తెలియంది కాదు. మిత్రధర్మం అంటూ సరైన ‘టైం’ కోసం ఎదురుచూస్తున్నామంటూ కవర్ చేసుకోవటాన్ని ఎంతోకొంత అర్థం చేసుకోవచ్చు. తమకు చేతకానిది.. తమ వైరిపక్షం చేస్తున్న వేళ.. దాన్ని అందిపుచ్చుకొని చితక్కొట్టేయాల్సింది పోయి చేతులెత్తేయటమే కాదు.. స్వయంగా చేతులు కాల్చుకోవటం చంద్రబాబు అండ్ కోకు మాత్రమే సాధ్యమవుతుంది.

ప్రత్యేకహోదా మీదా సరిగ్గా ప్రైవేటు బిల్లు ప్రవేశ పెడితే ఇష్యూ ఎంతవరకు వెళుతుందన్న విషయం కేవీపీ ప్రైవేటు బిల్లు పెట్టిన తర్వాత కానీ అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధి గురించి.. ప్రత్యేక హోదా మీద పట్టుదలతో పోరాడాలన్నదే చంద్రబాబు లక్ష్యమైతే.. కేవీపీకి ముందే ఈ అంశం మీద ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదన్నది ఒక ప్రశ్న. దాన్ని కూడా మిత్రధర్మం ఖాతాలో తీసి పక్కన పెడదామనే అనుకుందాం. మరి.. రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు.. దొరికిందే సందుగా తీసుకొని మోడీ అండ్ కోను ఎందుకు ఉతికి ఆరేయలేదన్నది ఒక ప్రశ్న.

ఉతికి ఆరేయటంలో అనుభవం లేదనే అనుకుందాం. అలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలే కానీ.. పెద్ద పీకుడుగాళ్ల మాదిరి మాట్లాడటం ఏమిటి? ఓకే.. మాట్లాడటాన్ని కూడా తప్పు పట్టకూడదనే అనుకునే వేళ.. సూటిగా.. స్పష్టంగా ఏపీ ఎదుర్కొంటున్న దుస్థితిని హృదయవిదారకంగా చెప్పి..మోడీ సర్కారును ఇరుకున పడేయాలే కానీ.. వెంకయ్యనాయుడికి ప్రచారకర్తగా మారటం.. మోడీ సర్కారు పల్లకిని మోయాల్సిన ఖర్మ తెలుగు తమ్ముళ్లకు ఏల? అన్న ప్రశ్నకు సమాధానం దొరకని దుస్థితి.

అంతా అయ్యాక.. ప్రతిఒక్కరూ వేలెత్తి చూపిస్తున్న వేళ.. తమ్ముళ్లను టెలికాన్ఫరెన్స్ లో ఏసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రైవేటు బిల్లుపై చర్చకు ముందే ఏం పొడిచేశారన్నది పెద్దప్రశ్న. గంటలు గంటలు కాకున్నా పట్టుమని పది నిమిషాల పాటు.. హోదా బిల్లుపై రాజ్యసభలో తెలుగుదేశం ఏం చేయాలన్న అంశాన్ని ప్రస్తావించి దిశానిర్దేశం చేస్తే ఇప్పుడీ కిందామీదా పడటాలు ఉండవు కదా? చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడేమో బావురుమనటం.. రాజ్యసభలో ఏంది లోక్ సభలో సత్తా చూపిద్దామంటూ చర్చలు జరపటం చూస్తే అనిపించేది ఒక్కటే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక..రాజ్యసభలో బీజేపీ పల్లకిని మోసిన తెలుగు తమ్ముళ్లు..  లోక్  సభలో పెద్దగా పీకేస్తారా? అన్న డౌట్ రాక మానదు. ఒకవేళ నిజంగానే లోక్ సభలో పీకినా.. అదంతా రాజ్యసభలో వేసిన తప్పటడుగులకు సర్దుబాటు యవ్వారంగానే ఉంటుంది తప్పించి.. ఏపీ మీద ప్రత్యేక అభిమానంతో చేస్తున్నట్లు అనిపించదు. కొన్ని తప్పులు అసలే చేయకూడదు. ఒకసారి చేసిన తర్వాత వాటిని ఎంత కవర్ చేసినా కవర్ కావన్న సత్యం బాబుకు ఎప్పటికి తెలిసేను..?
Tags:    

Similar News