బాబు ద‌గ్గ‌ర టీడీపీ ఎంపీల పంచాయితీ

Update: 2017-10-06 05:56 GMT
టీడీపీ ఎంపీల‌కు ఇప్పుడు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింద‌ట‌. పేరుకు ఎంపీల‌మే కానీ త‌మ‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు ఏపీ టీడీపీ ఎంపీలు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌ల్లో త‌మ‌కు భాగ‌స్వామ్యం లేకుండా పోవ‌టం.. ల‌బ్థిదారుల ఎంపిక‌లోనూ త‌మ ప్ర‌మేయం ఏమీ లేకుండా పోతున్న తీరుపై వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎంపీలుగా ఉన్న‌ప్ప‌టికీ ఉత్స‌వ విగ్ర‌హాలుగా మారుతున్న వైనం వారిలో అసంతృప్తిని అంత‌కంత‌కూపెంచేలా చేస్తోంది. త‌మ‌లో అంత‌కంత‌కూ పెరుగుతున్న అసంతృప్తిని ఇటీవ‌ల తమ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందు పెట్టారు. పాల‌న‌లోనూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌ల్లోనూ ఎమ్మెల్యే పాత్ర అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే.. ఎంపీల పాత్ర మాత్రం అందుకు భిన్నంగా త‌గ్గిపోతుంద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్యేల మాదిరే తమ‌ను కూడా ప్ర‌జ‌లే ఎన్నుకున్నార‌ని.. ఆ మాట‌కు వ‌స్తే ఎమ్మెల్యేల‌తో పోలిస్తే ఎంపీలుగా త‌మ ప‌రిధే ఎక్కువ‌ని.. అయిన‌ప్ప‌టికీ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నది వారి ఫిర్యాదు.  త‌మకు విధేయుడిగా ఉన్న వారు వ‌చ్చి ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో ల‌బ్ధిదారుల్ని చేయాల‌ని కోరితే తామేం చేయ‌లేక‌పోతున్న‌ట్లుగా వారు వాపోతున్నారు. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చినోళ్లు ఏమైనా అడిగితే నేరుగా చేసే అవ‌కాశం ఉండ‌టం లేద‌ని.. సంబంధిత ఎమ్మెల్యేకు మాత్ర‌మే తాము సిఫార్సు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. దీంతో.. ఎమ్మెల్యే చేస్తే స‌రి.. లేకుంటే ఇబ్బందే అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింద‌న్న ఆవేద‌న‌ను బాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవ‌ల కాలంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన అంశాల్లో ఎంపీలు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని బాబు చెప్పిన వైనాన్ని వారు త‌ప్పు ప‌డుతూ.. త‌మ ప‌రిధి కుంచించుకుపోవ‌టాన్ని వారు ప్ర‌శ్నించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మ‌ధ్యేమార్గాన్ని సూచించిన‌ట్లుగా తెలుస్తోంది. ఫించ‌న్లు మొద‌లుకొని ప‌లు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ఎంపీల‌కు కొంత‌ కోటాను ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితి కంటిన్యూ అయితే ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళితే.. వారిని ఎదుర్కొన‌టం ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఎంపీల వాద‌న‌పై  సీఎం  చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఎంపీల ఇబ్బంది త‌న‌కు అర్థ‌మ‌వుతుంద‌ని.. ల‌బ్థిదారుల ఎంపిక పూర్తిగాప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతుంద‌న్నారు. ఎంపీల వ‌ద్ద‌కు వ‌చ్చే వారి అవ‌స‌రాల్ని ఇన్ చార్జ్ మంత్రికి చెప్పాల‌ని వారి చేత ప‌నులు చేయిస్తామ‌న్నారు. ఎంపీల ప‌ట్ల ఎలాంటి వివ‌క్ష లేద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఎంపీలు బ‌ల‌ప‌డితే స్థానికంగా వ‌ర్గాలు త‌యార‌వుతున్నాయ‌ని.. దీంతో స‌మ‌స్య‌లు ఎదురువుతున్న విషయాన్ని ఎమ్మెల్యేలు త‌న దృష్టికి తీసుకొచ్చిన విష‌యాన్ని బాబు ప్ర‌స్తావించారు. దీనికి స్పందించిన ఎంపీలు.. ప్ర‌తి విష‌యానికి ఎమ్మెల్యేల‌ను అడ‌గాలంటే ఇబ్బందిగా ఉంద‌ని.. త‌మ చేతులు క‌ట్టేసిన‌ట్లుగా ఉంద‌ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా అసంతృప్తితో ఉన్న ఎంపీల‌ను బాబు బుజ్జ‌గించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఎంపీలు చెబుతున్నట్లుగా పరిస్థితి ఉందా? అంటే.. లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఎంపీల‌కు సొంతంగా ఎంపీ లాడ్స్ ఉంటాయి. ఆ నిధుల‌తో ప‌లు కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించుకునే వీలుంది.  ప్ర‌జ‌ల‌కు నేరుగా ఆ నిధుల్ని కేటాయించే వీలుంది. అదే స‌మ‌యంలో ఎంపీలు చెబితే కాద‌నే ఎమ్మెల్యేలు వేళ్ల మీద లెక్కించొచ్చు. ప్ర‌త్యేక సంద‌ర్భాలున్న కొన్ని చోట్ల మాత్ర‌మే ఎంపీ.. ఎమ్మెల్యేల మ‌ధ్య సంబంధాలు స‌రిగా లేవ‌ని.. మిగిలిన చోట్ల అంతా బాగున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విష‌యాన్ని.. త‌మ‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌న్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీల తీరుపై ఏపీ అధికార‌పక్షంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News