మోడీ పొట్టచెక్కలు చేసిన టీడీపీ ఎంపీ మంత్రం

Update: 2016-08-06 07:15 GMT
ప్రత్యేక హోదా కోసం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయివేటు మెంబరు బిల్లు పెట్టి ప్రత్యేక హోదా పోరాటానికి ఊపు తేగా మిగతా ఎంపీలు కూడా పార్లమెంటులో దీనిపై గట్టిగానే గళం విప్పారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటు ముందు ఆందోళనలూ చేశారు. అంతెందుకు నిన్న ప్రధాని మోడీని కూడా కలిసి ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేశారు. అయితే... చివరి ప్రయత్నంగా టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్రాలు కూడా ట్రై చేసి చూశారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ ప్రత్యేక హోదా కోసం ఆయన ఏకంగా ప్రధాని ముందు మంత్రం పఠించి తన ప్రయత్నం చేశారు. అయితే... మిగతా టీడీపీ ఎంపీలు మాత్రం వేషాలు వేయడం బాగా అలవాటైపోయిన శివప్రసాద్ కు మోడీ అంతకంటే పెద్ద వేషగాడన్న సంగతి తెలిసినట్లుగా లేదని హాస్యమాడుతున్నారు. ఓ ఎంపీ అయితే.. ‘‘నీలాంటోళ్లను చాలామందినే చూశాడు లేవయ్యా ఆయన’’ అని అన్నారట. ఇదంతా ఎలా ఉన్నా శివప్రసాద్ మంత్రాలకు మాత్రం మోడీ పగలబడి నవ్వారట.
    
శుక్రవారం ఉదయం 12.40 గంటలకు టీడీపీ ఎంపీలతో మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత - చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అక్కడ ఓ ఆసక్తికరమైన మంత్రం పఠించారట.  ఆయన అలా మంత్రం చదవగానే మోడీ నవ్వు ఆపుకోలేక చాలాసేపు పగలబడి నవ్వారట.  మోడీని కలిసిన బృందంలో ఉన్న శివప్రసాద్ అక్కడ తన సహజ శైలిలో మాట్లాడారు. విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భార్య ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారంటూ ఆయనను అడుగుతున్నారని శివప్రసాద్ తొలుత మోడీకి  తెలిపారు. ఆ తర్వాత ఆయన పెద్ద స్వరంతో మంత్రాన్ని జపించారు. నరేంద్ర మోదీ - నారా చంద్రబాబులు కలిసి ఏపీని అభివృద్ధి చేయాలని ఎన్నో యుగాల కిందటే నిర్ణయమైందన్న అర్థం వచ్చేలా  నమో నారాయణాయ అంటూ మంత్రాన్ని పఠించారు. ఇందులో నమో అంటే నరేంద్ర మోదీ అని - నారా అంటే నారా చంద్రబాబునాయుడు అని శివప్రసాద్ చెప్పగానే మోడీ ఇక నవ్వు ఆపుకోలేకపోయారట.
    
అయితే.. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా శివప్రసాద్ తీరుపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా అంశంపై ప్రధానితో మాట్లాడడానికి వెళ్లి అక్కడ ప్రత్యేక హోదా అవసరమేంటి... మోడీ ఏం చేయాలి.. బీజేపీ ఏం హామీ ఇచ్చింది వంటి విషయాలను చెప్పి ఆయన్ను కమిట్ చేయడం మానేసి కామెడీ చేసి రావడంపై మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మోడీతో సమావేశాన్ని కామెడీగా ముగించేశారని.. ప్రత్యేక హోదాపై వారికి చిత్తశుద్ధి లేదని అంటున్నారు. సీరియస్ మేటర్ ను కావాలనే డైవర్టు చేశారని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News