కుప్పం ఎఫెక్ట్‌: వారిపై వేటు.. ఏం జ‌రుగుతుంది...?

Update: 2022-01-14 08:52 GMT
టీడీపీ అదినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించేందుకు కొందరు చేసిన ప్ర‌య‌త్నంగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీతో లాలూచీ ప‌డి.. ముడుపులు అందుకుని.. సొంత పార్టీకి ద్రోహం చేశార‌ని.. కొంద‌రు కీల‌క నేత‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే.. ఇటీవ‌ల కాలంలో రెండు సార్లు ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టించారు. దాదాపు 35 ఏళ్లుగా లేని పార్టీ ప‌రిణామాలు ఎందుకు మారాయ‌నే విష‌యంపై ఆయ‌న దృష్టిపెట్టారు.

ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. వీరిలో గౌరివాని శ్రీనివాసులు వంటి వారు కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. పార్టీ నుంచి సాగ‌నంపుతున్నార‌ని.. వారి అనుచ‌రులు బాహాటంగానే చెబుతున్నారు.అ దేస‌మ‌యంలో ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డికి కుప్పం బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యారు.

మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎందుకంటే.. కుప్పంలో వైసీపీ జెండాను .. వ‌చ్చే ఎగ‌రేయించే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే అమ‌ర్‌నాథ్ అయితే.. ఇక్క‌డ వ్యూహ‌త్మ‌కంగా పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని..  చంద్ర‌బాబు భావిస్తున్నారు.

కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది సాధ్య‌మేనా.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తోను.. స్థానిక కేడ‌ర్‌తోనూ బంధాన్ని పెన‌వేసుకున్న నాయ‌కులు.. చిన్న‌పాటి త‌ప్పు చేశార‌ని.. వారిని ఏకంగా పార్టీ నుంచి సాగ‌నంపే ప్ర‌య‌త్నం చేస్తే.. కొండ‌నాలిక‌కు మందు వేస్తే..ఉన్న‌నాలిక పోయిన‌ట్టు అవ‌దా? అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇలాంటి విష‌యాల్లో చంద్ర‌బాబు ఆచితూచి అడుగులు వేయ‌క‌పోతే.. ఇబ్బంది త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News