టార్గెట్ మిడిల్ క్లాస్ : టీడీపీకి కొత్త ఓటు బ్యాంక్....?

Update: 2022-07-25 12:30 GMT
మధ్యముడు అంటే అధముడే. వారెవరికీ పట్టరు. నిజానికి పురాణాలు తీసుకున్నా పెద్ద కొడుకు, చిన్న కొడుకుకూ పెద్దల కర్మకాండలు చేసే అవకాశం ఇచ్చారు. మధ్యముడు మాత్రం ఎందుకూ పనికిరాడు అని నిర్ధారించేశారు.  ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితే మధ్యతరగతి వర్గానిది అని చెప్పాలి. నానాటికి దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ. ద్రవ్యోల్బనంతో పాటు అన్ని రకాలైన ఇబ్బందులు ప్రకృతి విపత్తులు అన్నీ కలసి మధ్యతరగతిని అథోగతి పాలు చేశాయి.

ఇక రాజకీయ పార్టీలు కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ పోతున్నాయి. పేదవారి మీదనే ఎపుడూ  వారి చూపు ఉంది. వారినే బాగా  ఫోకస్ చేస్తున్నారు. ఏ సంక్షేమ పధకం అయినా వారి చుట్టే తిరుగుతుంది. ఈ రోజు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం పేదలు అంటోంది తప్ప మిడిల్ క్లాస్ గురించి అసలు పట్టించుకోవడంలేదు. వీరంతా పట్టణాలు, నగరల్లో హెచ్చు సంఖ్యలో ఉన్న్నారు. వీరే ప్రభుత్వం మీద వ్యతిరేకతను నిండా పెంచగలరు.

వీరిలో చదువరులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరు ఎపుడూ సర్కార్ విధానాలను నిష్పక్షపాతంగా తూర్పారా పడతారు. ఇపుడు ఏపీ అప్పుల్లో కూరుకుపోవడం, అలవి కాని సంక్షేమాన్ని అమలు చేయడం పట్ల గుర్రుమంటోంది ఈ సెక్షనే. పైగా వీరు ఏ ఒక్క పధకానికి కూడా అర్హులు కాలేకపోతున్నారు. ఆ అసంతృప్తి నిండా ఉంది.

వీరి కోసం మూడేళ్ళ వైసీపీ సర్కార్ ఏమీ చేయలేదు. దాంతో ఈ వర్గాలను మచ్చిక చేసుకుంటే కొత్త ఓటు బ్యాంక్ గా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల షేర్ పెరిగి అధికారానికి రీచ్ కాగలమని టీడీపీ గట్టిగా భావిస్తోంది. నిజానికి ఈ సెక్షన్ ఇపుడు టీడీపీ వైపే ఆశగా చూస్తోంది. దాంతో తామే వారిని అక్కున చేర్చుకుంటే వారు కచ్చితంగా పోలింగ్ బూతుల దాకా వస్తారని భావిస్తోంది.

తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికను ఈసారి చాలా జాగ్రత్తగా రూపొందిస్తోంది అంటోంది. ఏపీ అప్పుల కుప్ప అయిన నేపధ్యంలో మరిన్ని ఉచిత హామీలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమనే ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. ఇక సంక్షేమం విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే తీసుకుంటారు అని అంటున్నారు.

ఆ విధంగా పేదల పక్షాన ఉంటూనే మధ్యతరగతిని ఆకట్టుకునే మార్గాన్ని కూడా టీడీపీ అన్వేషిస్తోంది అని అంటున్నారు. మధ్యతరగతి వర్గాల ఓట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో అరవై సీట్ల దాకా పట్టణ నేపధ్యంలో ఉన్నవే ఉన్నాయి. దాంతో ఈ సీట్లలో కనుక తమకు అనుకూలతను తెచ్చుకుంటే కచ్చితంగా ప్రభుత్వం వస్తుంది అని టీడీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు.

ఇక మధ్యతరగతి వర్గాలకు ఇళ్ళు లేవు, వారిని నిత్యావసరాలు కూడా భరంగా ఉన్నాయి. వారిలో ఎవరికీ తెల్ల రేషన్ కార్డు లేదు. గతంలో పింక్ కార్డు వారికి ఉండేది దాన్ని తీసేశారు. ఇపుడు వీరిని టార్గెట్ చేయబోతున్న టీడీపీ వారికి కూడా వారి కొరకు వేరే  రేషన్ కార్డులు ఇచ్చి సరసమైన ధరలకు సన్న బియ్యం ఇచ్చే ఆలోచన చేయాలనుకుంటోంది అంటున్నారు.

అదే విధంగా మధ్యతరగతి వర్గాలకు పది లక్షల లోపునే ఒక ప్లాట్ ని కట్టించి ఇచ్చే విధంగా కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకురావలని చూస్తోంది. ఇలా వారి కూడు గూడు విషయంలో కచ్చితమైన హామీలు ఇస్తే కనుక వారు టీడీపీకి బాసటగా ఉంటారని అంచనా కడుతోంది. నిజానికి ఈ విషయంలో జగన్ సర్కార్ జగన్న స్మార్ట్ సిటీస్ అని చెప్పినా కూడా వాటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక చాలా మంది ఆసక్తి చూపడంలేదు. దాంతో దీన్ని అవకాశంగా తీసుకుని రీజనబుల్ ధరలతో సొంతిల్లు ఇచ్చే ఆలోచనతో టీడీపీ ఉందని అంటున్నారు. చూడాలి మరి మిడిల్ క్లాస్ కదిలి వస్తే అది కొత్త ఓటు బ్యాంక్ అవుతుంది. అపుడు ఎన్నికల ఫలితాలు తారు మారు అవడం ఖాయం,.
Tags:    

Similar News