ఈ హోర్డింగ్‌ లు ఎవ‌రివి?... టీడీపీ ప్లాన్ రివ‌ర్సేనా?

Update: 2019-02-10 13:29 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గుంటూరు టూర్ సంద‌ర్భంగా నవ్యాంధ్ర‌లో భారీ ఎత్తున నిర‌స‌న ర్యాలు, ధర్నాలు, కుండ బ‌ద్ద‌లు కార్య‌క్ర‌మాలు జోరుగానే సాగాయి. అయితే ఎంత నిర‌స‌న‌లు వ్య‌క‌మైనా మోదీ గుంటూరు వ‌చ్చారు. బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తాను సిద్ధం చేసుకున్న ప్ర‌సంగాన్ని క్లారిటీగా , క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా చ‌దివేసి వెళ్లిపోయారు. అయితే మోదీ టూర్‌ ను వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గాల్లో అంద‌రి కంటే ముందున్న అధికార పార్టీ టీడీపీ మాత్రం ఇప్ప‌డు పెద్ద ఇబ్బందుల్లోనే ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. మోదీ టూర్‌ ను వ్య‌తిరేకిస్తూ ఆ టీడీపీ నేత‌లు, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న ప‌లు సంస్థ‌లు, వ్య‌క్తులు భారీ ఎత్తున నిర‌స‌న‌ల‌కు తెర తీశారు. నిన్న మ‌ధ్యాహ్నం నుంచే ఈ నిర‌స‌న‌ల హోరు మొద‌లైపోయిన విష‌యం తెలిసిందే. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా మోదీ ల్యాండైన గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు దాకా ప‌లు ప్రాంతాల్లో మోదీ టూర్‌ ను వ్య‌తిరేకిస్తే భారీ సంఖ్య‌లో హోర్డింగులు క‌నిపించాయి.

మోదీ గో బ్యాక్‌, మోదీ నోట ఎంట్రీ, మోదీ నెవ‌ర్ అగైన్... అంటూ మోదీ ఫొటోల‌తో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగుల‌ను ఎవ‌రు ఏర్పాటు చేశార‌న్న వివ‌రాలేమీ లేవు. సాధార‌ణంగా ఏదేని హోర్డింగ్ ను ఏర్పాటైతే... దానిపై దానిని ఏర్పాటు చేసిన వారెవ‌ర‌న్న విష‌యం.. అది సంస్థ అయినా, వ్య‌క్తి అయినా పేరు ఉండి తీరాల్సిందే. అయితే మోదీకి వ్య‌తిరేకంగా ఏర్పాటైన హోర్డింగుల‌పై ఈ త‌రహాలో వివ‌రాలేమీ లేవు. ఏపీకి ఎంత అన్యాయం చేసినా... మోదీ ప్ర‌ధాని హోదాలో ఉన్నారు క‌దా. దేశ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకించ‌డంమంటే... కాస్త క‌ష్ట‌మే క‌దా. మ‌రి ఆ క‌ష్ట‌త‌ర‌మైన ప‌నిని చేయాలంటే ద‌మ్మూ ధైర్యం కూడా అవ‌స‌ర‌మేన‌ని చెప్పాలి. అయితే మోదీ ప‌ర్య‌ట‌న‌ను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఈ హోర్డింగుల విష‌యంలో వాటిని ఏర్పాటు చేసిన వారిలో ఈ ద‌మ్ము లోపించిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. అయితే మోదీ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాలు చూసే స్పెష‌ల్ ప్రొట‌క్ష‌న్ గ్రూప్‌ (ఎస్పీజీ) దానిని అంత ఈజీగా ఏమీ వ‌ద‌ల‌దు క‌దా.

ఈ క్ర‌మంలో స‌ద‌రు హోర్డింగుల‌ను చూసిన ఎస్పీజీ... అస‌లు వాటిని ఏర్పాటు చేసిన వారి పేర్లు వాటిపై ఎందుకు లేవు? ఎవ‌రు ఏర్పాటు చేశారు?  వివ‌రాలు లేకుండా హోర్డింగులు ఏర్పాటు  చేస్తుంటే క‌ళ్లు మూసుకుని కూర్చున్నారా? అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌పై ఫైర్ అయ్యింద‌ట‌. దీంతో బిక్క‌చ‌చ్చిపోయిన రాష్ట్ర అధికారులు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక నానా తంటాలు ప‌డ్డార‌ట‌. అంతేకాకుండా అలా ఏర్పాటైన హోర్డింగుల్లో కొన్నింటిని అప్ప‌టిక‌ప్పుడు తొల‌గించేసి ఏదో ప‌ని అయిపోయింద‌న్న చందంగా వ్య‌వ‌హ‌రించినట్లుగా స‌మాచారం. అయితే ఈ విష‌యాన్ని టేక‌ప్ చేసింది కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని విభాగం క‌దా. మ‌రి ఈ విష‌యాన్ని వారు అంత ఈజీగా ఎందుకు వ‌దులుతారు?  అంటే... టీడీపీ అండాదండాతోనే ఏర్పాటైన ఈ హోర్డింగుల క‌థ తేలేదాకా ఎస్సీజీ వ‌ద‌ల‌ద‌న్న మాట‌. వెర‌సి టీడీపీ ప్లాన్ రివ‌ర్సైందా? అన్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.
Tags:    

Similar News