గెల‌వ‌క పోయినా ఫ‌ర్లేదు.. తిరుప‌తిపై టీడీపీ స్ట్రాట‌జీ ఇదే..!

Update: 2021-03-25 02:58 GMT
తిరుపతి పార్ల‌మెంటు స్థానానికి వ‌చ్చే నెల 17‌న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌పై టీడీపీకి గెలుపు ఆశ‌లు లేక‌పోయినా సంచ‌ల‌నంపై ఎక్క‌డో ఆశ‌లు మిణుగు మిణుగు మంటున్నాయి. నోటిఫికేష‌న్‌కు ముందుగానే హంగామా ప్రారంభించిన‌ప్పుడు... ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని అనుకుంది. అయితే.. ఇదంతా కూడా స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు మాట‌. కార్పొరేష‌న్, న‌గ‌ర‌, పుర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక తిరుప‌తి టీడీపీ శ్రేణుల్లో ఓ విధ‌మైన నైరాశ్యం అలుముకుంది. తిరుప‌తి ఉప ఎన్నిక కోసం ఊరికి ముందుగానే హంగామా ప్రారంభించిన చంద్ర‌బాబు... కేంద్ర ‌మాజీ మంత్రి, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌.. ప‌న‌బాక ల‌క్ష్మికి తిరిగి టికెట్ ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారిపోయింది.

స్థానిక సంస్థ‌ల‌లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. తిరుప‌తి కార్పొరేష‌న్‌ను కూడా వైసీపీ ద‌క్కించు కుంది. తిరుప‌తితో పాటు ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న ప‌లు మున్సిపాల్టీల్లో చాలా డివిజ‌న్ల‌లో టీడీపీకి అభ్య‌ర్థులే లేకుండా పోవ‌డంతో వైసీపీకి ఎక్కువ ఏక‌గ్రీవాలు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఎఫెక్ట్ పార్ల‌మెంటు ఎన్నిక‌పైనా ఉంటుంద‌ని టీడీపీ అంచ‌నా వేసుకుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచి తీరాల‌ని అనుకున్న స్ట్రాట‌జీని రెండోదిగా మార్చుకుని.. వైసీపీ అంచ‌నాల‌ను చిత్తు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు త‌మ్ముళ్ల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ కీల‌క నాయ‌కులు.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, వ‌ర్ల రామ‌య్య‌, అచ్చెన్నాయుడు వంటివారు ఇక్క‌డ మోహ‌రించారు.

ఇంకా చెప్పాలంటే టీడీపీ రాష్ట్ర క‌మిటీ అంతా ఇక్క‌డ మ‌కాం వేసేసింది. ఇప్పుడు వీరి ప‌ని.. ప‌న‌బాక ల‌క్ష్మిని గెలిపించుకోవ‌డం క‌న్నా.. వైసీపీ దూకుడును అడ్డుకోవ‌డ‌మే. అంటే.. దాదాపు టీడీపీ గెలుపుపై ఆశ‌లు వ‌దిలేసుకుని.. వైసీపీ మెజారిటీ‌ని గ‌ణ‌నీయంగా త‌గ్గించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టింది. ఒక‌వైపు గెలుపున‌కు ఉన్న అవ‌కాశాల‌ను స‌రిచేసుకుంటూనే.. మ‌రోవైపు గెలిచినా గెలవ‌క‌పోయినా.. సీఎం జ‌గ‌న్ ఏదైతే భారీ మెజారిటీ ల‌క్ష్యం పెట్టుకున్నారో.. దానికి గండికొడితే చాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసింది.

ఓట్ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు చీల్చే ప‌ని పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల నుంచి లోపాయికారీగా సాయం పొందేందుకు కూడా రెడీ అయిన‌ట్టు స‌మాచారం. జ‌న‌సేన‌తో కూడా టీడీపీ ఇప్ప‌టికే లోపాయికారిగా ఒప్పందం చేసుకుంద‌న్న గుస‌గుస‌లు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. కేవ‌లం వైసీపీకి మెజారిటీ త‌గ్గించే వ్యూహంతోనే ముందుకు సాగ‌డం దాదాపు ఖ‌రారైంద‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News