టీమిండియాకు జడేజా లోటు.. టి20 ప్రపంచ కప్ లోనూ?

Update: 2022-09-03 14:13 GMT
టీమిండియాలో రవీంద్ర జడేజా పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో జట్టు కోహ్లి, రోహిత్, రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉంటే.. సూర్య కుమార్ యాదవ్ వంటి హిట్టర్ ను కాదని జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపారు. దీన్నిబట్టే అతడి ప్రాధాన్యం తెలిసిపోతోంది. దీనికితగ్గట్లే జడేజా అద్భుతంగా రాణించి జట్టు గెలుపులో కీలకంగా మారాడు. ఇక హాంకాంగ్ తో మ్యాచ్ లోనూ అద్భుతమైన త్రో తో రనౌట్ చేసి ఔరా అనిపించాడు.

అలాంటి జడేజా గాయం కారణంగా ఆసియా కప్‌ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి రానున్నాడు. ''జడేజా మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు. టోర్నీలో మిగతా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడు. బీసీసీఐ వైద్య బృందం అతణ్ని పర్యవేక్షిస్తోంది. ఆసియా కప్‌ కోసం స్టాండ్‌బైగా ఎంపికైన అక్షర్‌ పటేల్‌.. జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడు. అతను త్వరలోనే దుబాయ్‌లో జట్టును కలుస్తాడు'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా.. హాంకాంగ్‌తో తర్వాతి మ్యాచ్‌లో ఒక వికెట్‌ పడగొట్టాడు.

కిం కర్తవ్యం?

మూడేళ్లుగా జడేజా బ్యాట్స్ మన్ గానూ అదరగొడుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ లతో లోయరార్డర్ లో ధోనీ లేని లోటును తీరుస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడు అంటూ విమర్శలు చేసిన మంజ్రేకర్ లాంటి వారు ఇప్పుడు జడేజాను కీర్తిస్తున్నారు. ఇప్పుడు నీతో మాట్లాడొచ్చా? అంటూ అడుక్కుంటున్నారు.

అంతగా రవీంద్ర జడేజా స్థాయి పెరిగింది. అంతెందుకు 2022 ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో అతడు ఒకడు. చెన్నై జట్టు పగ్గాలు అందుకుని ధోనికి వారసుడిగా మారాడు. వైఫల్యాలతో కెప్టెన్సీని విడిచి పెట్టడం తర్వాతి సంగతి. అయితే, ఆసియా కప్ లో టీమిండియా ఆదివారం పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ ఆడాల్సి ఉంది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ తోనూ తలపడాల్సి ఉంది. వీటిలో కనీసం రెండు మ్యాచ్ లైనా నెగ్గితేనే ఫైనల్ కు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి కీలక సమయం జడేజా దూరం కావడం లోటే. తనలాగే ఎడమచేతి బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్న అక్షర్ పటేల్ ను ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్ మెంట్ తెలివైన ఆలోచన.

అక్షర్ రాణిస్తే

అక్షర్ పటేల్ రెండేళ్లుగా రాటుదేలుతున్నాడు. వరుసగా వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్ లోనూ దమ్ము చూపుతున్నాడు. వెస్టిండీస్ తో సిరీస్ లో ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. దాంతో అతడిని జడేజాకు సరైన వారసుడిగా పరిగణిస్తున్నారు. మరోవైపు జడేజా గాయం ఆసియా కప్ నకే పరిమితమా? టి20 ప్రపంచ కప్ నకూ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

కొన్నాళ్లుగా జడేజా వరుసగా గాయాలకు గురవుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్ లోనూ ఇలాగే తప్పుకొన్నాడు. ఆ మధ్య తన కెరీర్ ను పొడిగించుకునేందుకు ఏదో ఒక ఫార్మాట్ ను వదిలేస్తాడు అనే మాట వినిపించింది. ఇక  ప్రస్తుత గాయం తీవ్రమైనదైతే ప్రపంచ కప్ నకు దూరమైనట్లే. అదే జరిగితే టీమిండియాకు పెద్ద నష్టమే. పేస్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్ రౌండర్ గా జడేజా ఇద్దరు దుమ్మురేపుతున్న స్థితిలో భారత జట్టుకు గాయాలు ఎదురవుతుండడం ఇబ్బందికరమే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News