టెకీలు కూడా డ్ర‌గ్స్ కు అల‌వాట‌య్యారా?

Update: 2017-07-24 05:35 GMT
సాఫ్ట్‌ వేర్ రంగం...బ‌య‌ట‌కు ఎంత గ్లామ‌ర‌స్‌ గా క‌నిపిస్తోందో లోప‌ల అంత ఒత్తిడి ఉంటుంది. ఎంట్రీ లెవ‌ల్ ఉద్యోగి నుంచి ఉన్న‌త స్థానాల్లో ఉన్న బాస్‌ల‌ వ‌ర‌కు ప్రాజెక్టులు..డెడ్‌ లైన్లు - క్ల‌యింట్ల‌కు సేవ‌ల‌ విష‌యంలో ఎదుర్కునే ఒత్తిడి అనుభ‌వించే వారికి, వారి ఆప్తుల‌కు మాత్ర‌మే తెలుసు! అయితే అలా ఒకింత ఒత్తిడికి చిరునామాగా మారిన ఐటీ రంగంలోకి కూడా డ్ర‌గ్స్ ఎంట్రీ అయింద‌ట‌. ఐటీ కంపెనీల్లో పని చేసే కొందరు ఉద్యోగులు పని ఒత్తిడి - మానసికంగా అలసిపోవడంతో ప్రశాంతత కోసం మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నట్లు ఒకటి రెండు కంపెనీలు గుర్తించాయి. హైద‌రాబాద్‌ ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల దందా - తాజాగా ఐటీ రంగంలో కూడా క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

హైదరాబాద్ నగరం - శివారుల్లో కలిపి చిన్నా - పెద్దా - బహుళజాతి ఐటి - ఐటి ఆధారిత సాంకేతిక సేవల కంపెనీలు సుమారు 1183 ఉన్నట్లు తాజా అంచనా. వీటిలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు. సైబరాబాద్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలు - దేశాలకు చెందిన ఐటి నిపుణులు - ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో అందుకు అనుగుణంగా పబ్బులు - క్లబ్బులు - స్టార్ రేంజ్ సౌకర్యాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు జరిగాయి. టెకీల‌కు సంతోషానికి చిరునామా అయిన వీకెండ్‌ ల‌లో జ‌రిగే పార్టీల‌లో మద్యం సేవించడం - పబ్బుల్లో చిందేయడం హైదరాబాద్ మెట్రోపాలిటన్ కల్చర్‌ లో ఎప్పటినుంచో సర్వసాధారణంగా కొనసాగుతోంది. పబ్బుల ముసుగులో కొందరు ఐటీ ఉద్యోగులు మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) తీసుకుంటున్నట్లు కొన్ని కంపెనీలు గుర్తించాయి. ఆ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులపై నిఘా ఉంచి వారి రక్త - మూత్రం నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు తెలుస్తోంది.

ఐటీ - ఐటీ ఆధారిత సాంకేతిక సేవలందించే కంపెనీలే కాకుండా బిపిఓలు - కెపిఓల్లో పని చేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది మద్యం - మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. పని ఒత్తిడి - వృత్తిలో పోటీ - కాలపరిమితుల విధింపు తదితర కారణాల వల్ల మత్తుకు బానిస అవుతున్నారు. మత్తుకు అలవాటు పడడానికి వీటితో పాటు పదోన్నతుల కోసం పోటీపడి పని చేయడం, వ్యక్తిగత రుణాలు - వాయిదాల చెల్లింపులు - ఒత్తిడిని అధిగమించాలనే తపన కూడా డ్రగ్స్ వైపు వెళ్లేందుకు కారణమవుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టెకీల్లో కొంతమంది మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న నేపధ్యంలో ముందే మేల్కొంటే మంచిదని ఐటి రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగంలో చేరేందుకు జరిగే ఇంటర్వ్యూ - తదనంతర ధర్డ్ పార్టీ విచారణ సందర్భంగానే డోప్ టెస్ట్ (మాదక ద్రవ్యాలు వినియోగం) నిర్వహించాలని చెబుతున్నారు. ఈ టెస్ట్‌ల్లో పాజిటివ్ అని తేలితే ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాలని, నెగిటివ్ అని తేలితే ఉద్యోగ నియామకం ఖరారు చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఉద్యోగంలో చేర్చుకునే ముందే డోప్ టెస్ట్ చేస్తే ఆ తర్వాత అవసరం ఉండదని, ఇంటర్వ్యూ నిబంధనల్లోనే ఇలా నిబంధనను చేర్చాలని చెబుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిత్వ వికాసం, వృద్ధి కోసం చేపట్టే శిక్షణ పట్టికలో మాదక ద్రవ్యాల వినియోగం, నష్టాలు, ఇబ్బందులు, వాటికి బానిస కాకుండా ఎలా తమను తాము కాపాడుకోవాలనే అంశాలను సైతం పొందుపర్చాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌ లో డ్రగ్ రాకెట్ వెల్లడి కావడంతో బహుళజాతి ఐటీ కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్‌ లోని తమ శాఖల కార్యాలయాలకు అప్రమత్తత ఈ-మెయిల్స్ పంపించినట్లు సమాచారం.
Tags:    

Similar News