పెళ్లాల గురించి రచ్చ రచ్చ చేసుకుంటున్నారే..?

Update: 2016-03-26 04:02 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నిక​లు తొలిసారిగా అసభ్యకరమైన ఎత్తుగడలకు స్థావరమయ్యాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు యుద్ధం మొదలు కాక ముందే.. ప్రైమరీ ఎన్నికల్లో ఒకే పార్టీకి చెందిన ముఖ్యనేతల మధ్య మొదలైన మాటల యుద్ధం.. ఇప్పుడు వికృత రూపం దాల్చింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇరువురు నేతలు డోనాల్డ్ ట్రంప్.. ​టె​డ్ క్రుజ్ ల మధ్య పోటీ దిగజారింది. వీరిద్దరి మధ్య పెళ్లాల గోల మొదలైంది. దీంతో.. వీరి మధ్య నడుస్తున్న కొత్త పంచాయితీని చూసి అమెరికన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇప్పటికే తన నోటి దురుసుతనంతో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎంత కంపు చేయాలో అంత కంపు చేయటమే కాదు.. రిపబ్లికన్ పార్టీకి ఉన్న ఇమేజ్ ను భారీ డ్యామేజ్ చేస్తే.. తాజాగా భార్యల ఎపిసోడ్ తో ఈ పార్టీ ఇమేజ్ మరింత దిగజారింది. ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్యన రచ్చకు కారణం చూస్తే.. ఈ గొడవలో
​టె​డ్ క్రుజ్ వర్గానిదేనని చెప్పాలి. అయితే.. తమ వర్గం వారికి సంబంధం లేదని టె​డ్ క్రుజ్ వ్యాఖ్యానిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది పోటీలో నిలిచేందుకు ట్రంప్.. టెడ్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇదిలా ఉండగా యూటాలో ఎన్నికల సందర్భంగా ఆన్ లైన్ లో జరిగిన ప్రచారంలో భాగంగా టెడ్ క్రూజ్ వర్గం వారు.. డోనాల్డ్ ట్రంప్ భార్య.. గతంలో మోడల్ గా పని చేసిన మెలానియాకు చెందిన న్యూడ్ (నగ్న) ఫోటోల్ని బయటకు తెచ్చారు. ఆమె 2000లో బ్రిటన్ కు చెందిన జీక్యూ అనే మేగ్ జైన్ కు న్యూడ్ ఫోటోషూట్ చేశారు.

ఆ పత్రిక కవర్ పేజీని బయటకు తీసుకొచ్చి.. ‘‘ఈవిడే మెలానియా ట్రంప్. మీకు కాబోయే ప్రథమ మహిళ.. ఈమె మీకు వద్దనుకుంటే వచ్చే మంగళవారం జరిగే ఎన్నికల్లో టెడ్ కూజ్ కు మద్దతు ఇవ్వండి’’ అంటూ ప్రచారానికి తెర తీశారు. మామూలుగా నోటి దురుసుతనం ఎక్కువైన ట్రంప్ కు తాజా ప్రచారం ఒళ్లు మండేలా చేసింది. తన పెళ్లాన్ని ఇంత దారుణంగా అవమానించిన కూజ్ పై చెలరేగిపోయారు. నీ పెళ్లాం గుట్టు బయటకు తీసుకొస్తా అంటూ ట్రంప్ మండిపాటుతో వాతావరణం వేడెక్కింది.

అయితే.. ట్రంప్ భార్య న్యూడ్ ఫోటో వివాదంతో తనకు సంబంధం లేదని కూజ్ చెప్పుకున్నా.. ట్రంప్ నమ్మలేదు సరికదా.. ‘‘అబద్దాల కోరు క్రుజ్ జాగ్రత్తగా ఉండు. లేదంటే నీ భార్య గురించి బయటపెట్టాల్సి ఉంటుంది’’ అంటూ హెచ్చరించారు. దీనికి స్పందించిన కూజ్ ట్విట్టర్ లోట్వీట్ చేస్తూ.. ‘‘హైడీ (కూజ్ సతీమణి) పై  దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం డోనాల్డ్ నువ్వు నేను అనుకున్న దాని కంటే  పెద్ద పిరికివాడివి’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ట్రంప్ వర్గానికి చెందిన వారు కూజ్ సతీమణి అందవిహీనమైన ఫోటోను.. ట్రంప్ సతీమణి ఫోటోను ఒకే దగ్గర పెట్టి.. ఈ ఒక్క ఫోటో వంద మాటలకు సమానం అంటూ శీర్షిక పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో.. ఈ ఇద్దరు నేతల మధ్య భార్యల పోట్లాట తీవ్రస్థాయికి చేరినట్లైంది. తాజా పరిణామాలపై కూజ్ స్పందిస్తూ.. ‘‘నీ భార్య లవ్లీగా ఉంటుంది. కానీ నా భార్య నా జీవితానికే ప్రేమమూర్తి’’ అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు.. నా భార్య గొప్పంటే నా భార్య గొప్పని చెప్పుకుంటూనే.. ఎదుటోడి భార్యను చులకన చేసుకుంటున్న వ్యవహారం ఎక్కడి వరకూ దిగజారుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఏమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికకు ముందుగా జరుగుతున్న ప్రైమరీ  ఎన్నికల్లోనే ఇంత దారుణంగా ప్రచారం జరగటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News