ఆరోగ్య‌శ్రీ బ‌కాయిలు.. ప్ర‌భుత్వ లెక్క‌ల మాయాజాలం!

Update: 2021-10-07 05:53 GMT
తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ఆరోగ్య శ్రీ ప‌థ‌కం విష‌యంలో తాజాగా  ఓ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌థ‌కం ద్వారా పేద‌లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పాటు ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ ఉత్త‌మ వైద్య చికిత్స‌లు అందుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ పేద‌ల‌కు ఉచితి వైద్యం అందుతోంది. ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించే ఆసుప‌త్రులు ఆ త‌ర్వాత వాటి డ‌బ్బు కోసం ప్ర‌భుత్వానికి బిల్లులు పెట్టుకోవ‌డం.. ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేయ‌డం సాధార‌ణ‌మే. కానీ గ‌త కొంత కాలం నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ బ‌కాయిల విష‌యంలో ప్ర‌భుత్వం చెబుతున్న దానికి.. ఆసుప‌త్రులు స‌మ‌ర్పించిన బిల్లుల‌కు పొంత‌న ఉండ‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భుత్వం నుంచి రూ.700 కోట్లు బ‌కాయిలు రావాల‌ని ఆరోగ్య శ్రీ అనుసంధానిత ప్రైవేటు నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు చెప్తున్నాయి. కానీ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం రూ.160 కోట్లు మాత్ర‌మే బ‌కాయిలు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆశాదీప‌మైన ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి సంబంధించిన బ‌కాయిల విష‌యంలో ఇలా భారీ తేడాతో ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. ఆరోగ్య శ్రీ ఆసుప‌త్రుల‌కు చెప్తున్న బిల్లుల‌కు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించిన గ‌ణాంకాల‌కు ఏకంగా రూ.500 కోట్ల‌కు పైగా తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆసుప‌త్రులు స‌మ‌ర్పించే బిల్లుల స్క్రీనింగ్ ప్ర‌క్రియ‌నే దీనికి కార‌ణ‌మ‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆసుప‌త్రులు స‌మ‌ర్పించిన బిల్లుల‌ను స్క్రీనింగ్ ద‌శ‌లోనే వివిధ అభ్యంత‌రాల‌తో పెండింగ్‌లో పెడుతున్నారు. ఇలా పెండింగ్‌లో పెట్టిన బిల్లుల‌ను విడుద‌ల చేసే నిధుల ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. మ‌రోవైపు ఆసుప‌త్రులేమో ఈ పెండింగ్ బిల్లుల‌ను కూడా క‌లుపుకుని బకాయిల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అందుకే ఈ తేడా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో క్ర‌మంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 2014-15లో ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌భుత్వం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు రూ.294 కోట్లు చెల్లించ‌గా.. 2020-21 నాటికి అది రూ.513 కోట్ల‌కు చేరింది. ఏటా ఒక్కో రోగికి స‌గ‌టున వెచ్చించే చికిత్స ఖ‌ర్చు కూడా పెరిగింది. ముఖ్యంగా క్యాన్స‌ర్ కేసులు రాష్ట్రంలో ఎక్కువ‌వుతున్నాయి. 2020లో తెలంగాణ‌లో 47620 క్యాన్స‌ర్ కేసులుండ‌గా.. మ‌రో నాలుగేళ్ల‌లో ఆ సంఖ్య 11.1 శాతం పెరిగి 53565కు చేరుతుంద‌ని తాజా అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. గ‌త ఏడేళ్ల‌లో ఒక్క ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనే క్యాన్స‌ర్ రోగుల చిక‌త్స‌కు ప్ర‌భుత్వం రూ.200 కోట్ల వ‌ర‌కు చెల్లించింది. హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌త‌రాకం క్యాన్స‌ర్ ఆసుప‌త్రికి 2014-15లో రూ.11.38 కోట్లు ఇవ్వ‌గా.. 2020-21 నాటికి అది రూ.26.82 కోట్ల‌కు పెరిగింది. దీన్ని బ‌ట్టి క్యాన్స‌ర్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌రోవైపు ఈ ప‌థ‌కం కింద బ‌కాయిలు చెల్లించ‌డంలో ప్ర‌భుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడు నెల‌లుగా రెగ్యుల‌ర్‌గా బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని స‌మాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.150 కోట్లు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు చెల్లించ‌గా.. అవి కూడా పాత బాకాయిలేన‌ని ఆసుప‌త్రులు చెబుతున్నాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రో రూ.99 కోట్లు మాత్ర‌మే ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ప్ర‌తి నెలా ప్రైవేటు ఆసుప‌త్రుల్లో స‌గ‌టున రూ.100 కోట్ల బిల్లులు ఈ ప‌థ‌కం కింద జ‌న‌రేట్ అవుతున్నాయి. కానీ ప్ర‌భుత్వం చెల్లించిన‌దానికి పొంత‌నే ఉండ‌డం లేదు. ఒక రోగి ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించుకుంటే అందుకు సంబంధించిన బిల్లును నెల రోజుల్లోగా ట్ర‌స్ట్‌కు ఆసుప‌త్రులు స‌మ‌ర్పించాలి. ఆ బిల్లుకు ఆరోగ్య శ్రీ ట్ర‌స్ట్ మూడు నెల‌ల్లోగా చెల్లించాల‌నే నిబంధ‌న‌లున్నాయి. కానీ ఇది ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేదు.  ట్ర‌స్ట్‌కు రెగ్యుల‌ర్ సీఈవో లేక‌పోవ‌డం కూడా ఓ ఇబ్బందిగా మారింది. వారం క్రితం ప్ర‌భుత్వం నుంచి ఆరోగ్య శ్రీ ట్ర‌స్టుకు రూ.200 కోట్లు విడుద‌ల‌య్యాయి. ఆ డ‌బ్బును బ్యాంకుల ద్వారా ఆసుప‌త్రుల‌కు చెల్లించాలంటే ట్ర‌స్టు సీఈవో అనుమ‌తి కావాలి. కానీ ప్ర‌స్తుతం సీఈవోగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వీ బాగా బీజిగా ఉండ‌డంతో సంత‌కం చేయాలేద‌ని తెలుస్తోంది.  మొత్తానికి ఆరోగ్య శ్రీ విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు విమ‌ర్శ‌లకు తావిస్తోంద‌న్న అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి.
Tags:    

Similar News