చదువులమ్మ ఒడిలో తెలంగాణ శాసనసభ

Update: 2018-12-28 16:27 GMT
రాజకీయాలంటే చదువుతో పనిలేదు. రాజకీయలంటే డిగ్రీల కొలమానం అవసరం లేదు. అందున భారతదేశంలో అయితే మరీ అవసరం లేదు. దీనికి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన టంగటూరి అంజయ్య ఒక నిదర్శనమైతే - ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మరొక ఉదాహరణ. వీరిద్దరిలో అంజయ్య చదుకోని వారైతే - ప్రధాని నరేంద్ర మోదీ టీ అమ్మిన వ్యక్తి. భారత రాజకీయాలకు చదవూ - ఇతర వ్యాపకాలు ప్రధానం కాదు అనడానికి ఇదే ఉదాహరణ. సరే అసలు విషయానికి వస్తే.... తెలంగాణలో అతి త్వరలో కొలువు తీరనున్న తెలంగాణ శాసన సభ మాత్రం చదువులమ్మ తల్లి ఒడిలా కనిపించనుంది. రాజకీయాలకు చదువుతో సంబంధం లేకపోయిన ప్రజలకు మేలు చేసే కొన్ని అంశాలపై చర్చించేందుకు మాత్రం చదువుకున్న వారు కావల్సిందే. గతంలో ఏమో కాని ఈ సారి మాత్రం తెలంగాణ శాసన సభ ఉన్నత చదువులు చదువుకున్న వారితో నిండిపోనుంది. తెలంగాణలో జరిగిన ముందుస్తు ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి - కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన అనేక మంది శాసన సభ్యులు సభకు రానున్నారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారే కావడం విశేషం.

తెలంగాణ శాసన సభకు ఈసారి 5 డాక్టర్లు - ఎన్నికయ్యారు. వీరితో పాటు 13 మంది లాయర్లను కూడా ప్రజలు ఎన్నుకున్నారు. ఇక తెలంగాణ కొత్త శాసనసభలో ఇద్దరు పీహెచ్‌ డి సభ్యులు - తొమ్మిది మంది ఇంజనీర్లు ఉండడం గమనార్హం. వీరితో పాటు ఒక జర్నలిస్టు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. వీరుకాక డిగ్రీలు - పీజీలు చదివిన వారు చాలా మందే ఉన్నారు. ఈ చదువరుల వల్ల తెలంగాణ శాసన సభలో అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా వైద్య విధానాలు న్యాయపరమైన అంశాలు - ఇంజనీరింగ్ సంభంధిత విషయాలపై సమగ్రంగా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పలు అంశాలపై ఆయా రంగాలకు చెందిన వారు శాసన సభలో ఉంటే ఆ రంగాలకు మేలు జరుగుతుందని అంటున్నారు. వీరి సలహాలు - సూచనలతో తెలంగాణలో మరింత అభివ్రుద్ది కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Tags:    

Similar News