మోడీషాల వద్ద గులాబీ నేతలపై తొలి కంప్లైంట్ బుక్

Update: 2019-10-16 04:53 GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు తమిళ సై. ఈ సందర్భంగా ఆమె ఇరువురు ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకాంశాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అవినీతి మరక తెలంగాణ ప్రభుత్వానికి లేదని గతంలో కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు వర్షం కురిపించిన మోడీకి.. తాజాగా గులాబీ నేతలకు సంబంధించిన స్కాం వివరాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

గులాబీ పార్టీకి చెందిన కొందరునేతలు కరీంనగర్ లో భారీగా గ్రానైట్ వ్యాపారాన్ని అక్రమంగా నిర్వహిస్తూ.. పెద్ద ఎత్తున పన్నులు ఎగవేస్తున్న వైనాన్ని మోడీషాలకు తమిళసై వివరించినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇద్దరూ మైనింగ్ వ్యవహారంపై ఇప్పటికే ప్రస్తావిస్తున్నారు. ఇంతకాలం గులాబీ నేతలకు సంబంధించిన స్కాంలకు సంబంధించిన వివరాల్ని కేంద్రం సేకరించలేదని.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వివరాల్ని సేకరించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణపై ప్రత్యేక కన్ను వేసిన కేంద్రానికి.. గవర్నర్ తాజాగా ఇచ్చిన నివేదికలోని పలు అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు పెట్టే అంశాలుగా చెబుతున్నారు. మొత్తానికి గడిచిన ఆరేళ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారులో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార పార్టీకి సంబంధించిన చాలా అంశాలు కేంద్రం వరకూ వెళ్లలేదన్న మాట వినిపిస్తోంది. ఇందుకు భిన్నంగా ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలకు కారణమయ్యే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News