బండి సంజ‌య్ ఔట్‌.. ఈట‌ల ఇన్‌!

Update: 2022-06-20 03:29 GMT
తెలంగాణ బీజేపీ రాజ‌కీయం కీల‌క మ‌లుపు తిర‌గ‌నుందా?  పార్టీ చీఫ్‌ను మార్చేసే ప‌నిలో బీజేపీ అధిష్టానం దృష్టి సారించిందా?  వాయు వేగ మ‌నోవేగాల‌తో తెలంగాణ‌పై ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించిందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా బీజేపీ కీల‌క నాయ‌కుడు, హూజూరాబాద్ నుంచి బై పోల్‌లో గెలిచిన ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో చ‌ర్చించిన అమిత్ షా.. కీల‌క ప‌ద‌వికి సిఫార‌సు చేస్తాన‌ని చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

కీల‌క ప‌దవి అంటే.. బీజేపీ చీఫ్ మిన‌హా మ‌రొక‌టి లేద‌ని.. తెర‌మీదికి వ‌స్తున్న చ‌ర్చ‌. అంటే.. ప్ర‌స్తుత తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను ప‌క్క‌న పెట్టి.. ఆయన స్థానంలో ఈట‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని.. బీజేపీ ద్రుఢంగా నిర్ణ‌యించుకుంది. ఇప్ప‌టికేదీనికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా కీల‌కంగా దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే.. ఆయ‌న ఆనుపానులు తెలిసిన నాయ‌కుడు పార్టీకి అత్యంత అవ‌స‌రం. బండి సంజ‌య్ కొంత మేర‌కు కేసీఆర్‌ను డీ అంటే ఢీ అని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నా.. ఆశించిన మేర‌కు ఫ‌లితం రాబ‌ట్ట‌లేక పోతున్నారు.

సాగ‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయింది. హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లోనూ ఆశించిన విధంగా ప్ర‌యోజ‌నం క‌నిపించ లేదు. దీనికితోడు ఎన్నిక‌లు వ‌స్తున్నా.. పార్టీలో కొత్త‌గా చేరే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు.

టీఆర్ ఎస్‌పై ఆగ్ర‌హంతో ఉన్న సొంత పార్టీ నాయ‌కులు కూడా బీజేపీలో చేర‌డం లేదు. దీంతో బండి సంజ‌య్ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావ‌డం లేద‌నే భావ‌న పార్టీ అధిష్టానంలో ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బీసీ నాయ‌కుడిగా .. బ‌ల‌మైన గ‌ళం వినిపించే నేత‌గా ఉన్న ఈట‌ల‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. పార్టీ మ‌రింత దూకుడుగా ముందుకు సాగే అవ‌కాశం ఉంటుంద‌ని అధిష్టానం భావిస్తోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పార్టీలో నాయ‌కుల క‌న్నా.. అధికారానికి, దూకుడుకు ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ.. కేంద్రంలోనూ న‌రంద్ర మోడీ హ‌వాను వినియోగిం చుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో అనేక మంది నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. మోడీ ప్ర‌భంజ‌నం ప‌నిచేయ‌డంతో ఆయ‌న‌నే కీల‌కంగా భావిస్తోంది. ఇలానే.. తెలంగాణ‌లోనూ.. ఈట‌ల‌తో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అధిష్టానం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో బండిని ప‌క్క‌న పెట్టి.. ఈట‌ల‌కు రాష్ట్ర‌ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పైగా కేసీఆర్ ఆనుపానులు తెలిసిన నాయ‌కుడిగా, టీఆర్ ఎస్‌లోని వంద‌ల మంది నాయ‌కుల‌తో ఉన్న ప‌రిచ‌యాలు వంటివి.. ఈట‌ల‌కు క‌లిసి వ‌స్తాయ‌ని.. బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే బండిని ప‌క్క‌న పెట్టి.. ఈట‌ల‌కు ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News