వారి కంట కన్నీరు పెట్టిస్తారా కేసీఆర్..?

Update: 2015-09-03 04:19 GMT
ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తారో అర్థం కానట్లుగా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తమ హక్కుల సాధన కోసం ఎవరైనా సమ్మె చేస్తే.. వారు ఊహించిన దాని కంటే ఎక్కువ వరాన్ని ప్రకటించి వారి మనసుల్ని దోచుకునే ఆయన.. మరికొందరి విషయంలో మాత్రం కటువుగా ఉంటారు. వారెంత మొత్తుకున్నా మెత్తబడేందుకు ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు.. ఆర్టీసీ సిబ్బంది వేతనాల పెంపు.. అంగన్ వాడీలకు ఊహించనంతగా జీతాలు పెంచేసే కేసీఆర్ లో అందుకు విరుద్ధమైన కోణం మరొకటి కనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ల విషయంలో ఆయన పెద్దగా స్పందించరు. అంతదాకా ఎందుకు.. తాను ఏ పని చేయాలన్నా ముహుర్తం చూసి.. మంచి చెడుల గురించి చెప్పించుకొని.. వారి మాట ప్రకారమే అడుగు ముందుకేసే పండితుల సమస్యల గురించి పెద్దగా పట్టించుకోరు.

పండితులకు పెద్దపీట వేసే ఆయన అదే వర్గం చేస్తున్న పోరాటానికి మాత్రం స్పందించేందుకు ససేమిరా అంటుంటారు. తమ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు సమ్మె చేస్తున్నారు. నిత్యం దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ.. భగవన్మామ స్మరణ చేసుకునే వారి చేత నినాదాలు చేయించి.. వారి కడుపు మండలా ఎందుకు చేస్తున్నట్లు?

ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ అంత కష్టమైందా? ముఖ్యమంత్రి స్థాయిలో.. అందులోకి కేసీఆర్ లాంటి నేత స్థాయికి ఈ సమస్య పరిష్కారం ఎంత చిన్నది? కానీ.. వారు చేస్తున్న సమ్మెకు ఏమాత్రం స్పందన లేకుండా.. అసలు పట్టనట్లుగా వ్యవహరించటం ఆయనకే చెల్లింది.

దేవాలయ గోపురాలెక్కి.. రోడ్ల మీదకు వచ్చి.. తమ డిమాండ్ల సాధన కోసం అర్చకులు చేస్తున్న సమ్మెకు రాజకీయ వర్గాలన్నీ ఏకగ్రీవంగా మద్ధతు పలుకుతున్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్షానికి మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా ఉండకపోవటం గమనార్హం. వేదాలు పలికే వారి నోటి నుంచి వేదన దూషణలు కేసీఆర్ లాంటి నేతకు అంత మంచిది కాదేమో.

ఎందరో కష్టనష్టాలు తీర్చే కేసీఆర్.. అర్చకుల సమస్యలపై సానుకూలంగా స్పందించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నింటికి మించి సెంటిమెట్లకు పెద్దపీట వేసే కేసీఆర్ కు.. అర్చకుల కంట కన్నీరు మంచిదికాదన్న విపక్ష నేతల విమర్శలో ఎంతోకొంత అర్థం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. వారి కంట కన్నీరు తుడుస్తూ.. పెద్ద మనసుతో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారా? అన్నది చూడాలి.
Tags:    

Similar News