సారు మాటకు ఓకే చెప్పి ఈ ట్విస్టు ఏంది మోడీ?

Update: 2020-03-24 05:03 GMT
మాటల్లో కనిపించే కమిట్ మెంట్.. చేతల్లో అదే రీతిలో ఉండాలని లేదు. మాట ఇచ్చినంతనే పని అయిపోయినట్లు కాదు.మాట తర్వాత ప్రాసెస్ జరిగిన తర్వాతే పని పూర్తి అవుతుందన్నది మర్చిపోకూడదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అది ఇట్టే జరిగిపోతుందన్న నమ్మకం మనలో కూసింత ఎక్కువే. అందుకే.. ప్రముఖులు ఎవరైనా నోటి నుంచి వచ్చిన మాటకు మనం విపరీతమైన ప్రాధాన్యత ఇస్తాం.అంతా జరిగిపోయినట్లే భావిస్తాం. కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుంది.

కరోనా విపత్తు వేళ.. ముఖ్యమంత్రులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ.. వారితో చాలానే విషయాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మిగిలిన సీఎంలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చక్కటి సలహాను ఇవ్వటం తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో కేంద్రం అధీనంలో ఉండే సీసీఎంబీ అనే సంస్థ ఉందని.. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల విషయంలో ఆ సంస్థ తోపు అని.. ఆ సంస్థకు కరోనా నిర్దారిత పరీక్షలు చేయాలన్న ఆదేశాన్ని ఇస్తే మస్తు ప్రయోజనం కలుగుతుందన్నారు.

రోజులో వెయ్యి శాంపిల్స్ కు రిజల్ట్ ఇచ్చే సత్తా ఆ సంస్థ సొంతంగా చెప్పారు. దీన్ని తెలంగాణానే కాదు.. అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవచ్చన్నారు. కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటను విన్నంతనే మోడీ సైతం సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. సీసీఎంబీ కరోనా పరీక్షల్ని చేస్తుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఘనంగా చెప్పుకున్నారు. సోమవారం నుంచి ఈ సంస్థ తన పనిని మొదలు పెడుతుందని చెప్పారు.

కానీ.. అసలు ట్విస్టు ఏమంటే.. కరోనానిర్దారిత పరీక్షలు చేసేందుకు అవసరమైన కీలకమైన ముడి పదార్థం.. కరోనా కిట్లు. అవి లేకుండా పరీక్షలు చేయటం సాధ్యం కాదు. ప్రధాని మోడీ పరీక్షలు జరిపేందుకు అనుమతులు ఇచ్చినా.. అధికారులు అందుకు అవసరమైన కిట్లను పంపించకపోవటంతో ఇప్పుడేం చేయాలో తోచని పరిస్థితి. దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉంది. పరీక్షల నిర్దారణకు ప్రధాని ఓకే చెప్పినా.. పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు కేంద్రం నుంచి రాకపోవటంతో.. వాటి రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండటం తప్పించి మరో మార్గం లేదని చెప్పాలి. పరీక్షలు చేసేందుకు అనుమతి ఇచ్చినప్పుడు.. వాటికి అవసరమైన కిట్లు వెంటనే పంపాలన్న మాటను ప్రధాని ఎందుకు చెప్పనట్లు..? ఈ ట్విస్టేంది మోడీ సాబ్?


Tags:    

Similar News