కేంద్ర మంత్రుల‌ను క‌లిసే టైం కేసీఆర్‌కు లేదా

Update: 2015-09-05 17:13 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత మొండి ఘ‌ట‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కు తిక్క‌రేగితే ఎవ‌రికైనా నో ఎంట్రీ బోర్డు. కేసీఆర్  కేంద్ర మంత్రి గడ్క‌రీ ప‌ర్య‌ట‌న లో పాల్గొనేందుకు టైం లేద‌ని చెప్ప‌డం పై తెలంగాణ బీజేపీ శాఖ అధ్య‌క్షుడు కిష‌న్‌ రెడ్డి మండిప‌డుతున్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనే స‌మ‌యం లేద‌ని కేసీఆర్ అన‌డంతో రూ.1900 కోట్ల‌తో నిర్మించే వ‌రంగ‌ల్‌-యాదాద్రి హైవే శంకుస్థాప‌న ఆగిపోయింద‌న్నారు.

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక జ‌రుగుతున్నందునే కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నార‌ని కిష‌న్‌ రెడ్డి విమ‌ర్శించారు. ఈ హైవేకు గ‌డ్క‌రీ శంకుస్థ‌పాన చేస్తే బీజేపీకి ఫ్ల‌స్ అవుతుంద‌నే కేసీఆర్ ఇలా చేస్తున్నార‌ని కిష‌న్ ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణ‌లో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

 సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెద‌క్ ఆత్మ‌హ‌త్య‌ల జిల్లాగా మారింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని కిషన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఇక రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 7న నిజామాబాద్‌లోను, 8న హైద‌రాబాద్‌లోను దీక్ష చేస్తున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక ఆధిప‌త్య పోరు అనేది కేసీఆర్ కుటుంబంలోనే ఉంద‌ని..బీజేపీలో కాద‌న్న విష‌యం కేసీఆర్ తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

 ఏదేమైనా వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక దృష్ట్యా ప్ర‌తిప‌క్షాల‌కు కేసీఆర్ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వ‌డం లేదు. కిష‌న్‌ రెడ్డి పాద‌యాత్ర‌ను ఆపుచేయించిన ఆయ‌న ఏకంగా గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనే టైం లేద‌ని చెప్ప‌డం విచిత్రమే మ‌రి. ఈ ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీతో గెలిచి ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్కులు చూపించాల‌న్నదే కేసీఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News