హుజూర్ నగర్ కు వరాల వర్షం కురిపించిన కేసీఆర్

Update: 2019-10-27 04:57 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వస్తే ఎలా తట్టుకోలేమో? సంతోషం వచ్చినా ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది హుజూర్ నగర్ వాసులకు.  రాజకీయంగా సంకట స్థితిలో ఉన్న వేళ.. తనను  ఆదరించిన అభిమానించిన వారి విషయంలో తానెంతలా రియాక్ట్ అవుతానన్న విషయాన్ని తనదైన శైలిలో ప్రదర్శించారు కేసీఆర్.

హుజూర్ నగర్ గెలుపుతో వెయ్యి ఏనుగుల బలం వచ్చిన కేసీఆర్.. తన విషయంలో చూపించే ప్రేమకు తానెంత బానిసలా ఉంటానన్న విషయాన్ని అర్థమయ్యేలా తనదైన శైలిలో చెప్పేశారు గులాబీ బాస్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయాన్ని సాధించిన వేళ.. అక్కడో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఎన్నికల ప్రచారంలో కొందరు ఓర్వలేక అపోహలు.. అనుమానాలు.. నీలాపనిందలు వేశారని.. వాటన్నింటి విషయంలోనూ ప్రజలు ధీటైన సమాధానమిచ్చారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. నీళ్లు ఏవో.. పాలు ఏవో తేల్చారని.. కేసీఆరే రైట్.. గో ఎహెడ్ అని దీవించిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఉవ్వెత్తున ఉత్సాహపరిచిన హుజూర్ నగర్ ప్రజలకు తగ్గ ఫలితం దక్కాలన్న ఆయన.. వరాల వరదను పారించారు. ప్రతి పంచాయితీకి రూ.20లక్షలు.. మండలానికి రూ.30 లక్షలు.. హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లతో పాటు నేరేడు చెల్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు.. పాలిటెక్నిక్.. గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల.. హుజూర్ నగర్ లో బంజారా భవన్.. రెవెన్యూ డివిజన్ కార్యాలయం.. ఈఎస్ఐ ఆసుపత్రి ఇలా.. వరుస పెట్టి రూ.100 కోట్ల విలువైన వరాల్ని ప్రకటించారు.

తానిచ్చిన హామీల్ని వెనువెంటనే అమలు చేస్తామని.. తాను చెప్పిన వాటికి సంబంధించిన జీవోల్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. నల్లగొంగ జిల్లాలో పోడు భూముల సమస్య ఉందని.. దాని పరిష్కారానికి ప్రజాదర్బారునిర్వహిస్తామన్నారు. మరోసారి హుజూర్ నగర్ లో పర్యటించి.. జాన్ పహాడ్ దర్గా.. మట్టపల్లి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయాల దర్శనాలు చేసుకుంటామని చెప్పటం ద్వారా స్థానికులకు కనెక్ట్ అయ్యేలా మాటలు చెప్పారు.

1997లో తాను ఎన్టీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లా కరువు మంత్రిగా పని చేసిన వైనాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పట్లో తాను చేసిన పనుల జాబితాను ఏకరువు పెట్టారు. అప్పటి కరవు నేటికి కంటిన్యూ కావాలన్ని తప్ప పట్టారు. అంతా బాగుంది కానీ సారూ.. గడిచిన ఆరేళ్లుగా మనమే అధికారంలో ఉన్నాం కదా? మరి.. నల్గొండ జిల్లా కరువుకు చెక్ చెప్పేలా ఇంతవరకూ ఎందుకు చేయనట్లు..?
Tags:    

Similar News