ప్రగతిభవన్ లో ఉగాది పంచాంగ పఠనం.. కేసీఆర్ విశ్వరూపమే చూపిస్తారట

Update: 2022-04-03 05:36 GMT
ఉగాదిని పురస్కరించుకొని ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణంలో.. ఏడాది కాలంలో ఏం జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని.. పండితులు చెబుతుంటారు. అయితే.. మారిన పరిస్థితులకు అనుగుణంగా భజన చేయటం అన్ని రంగాలకు ఒక వైరస్ మాదిరి పట్టేసిన నేపథ్యంలో.. తమను పిలిచిన వారి మనసుల్ని దోచుకునేలా మాట్లాడటం.. ఆ క్రమంలో అసలు విషయాల్ని వదిలేసి.. కొసరు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ముగిసిన ఉగాది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ పఠనాన్ని చూస్తే.. ఈ తీరు ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నట్లుగా మారిందని చెప్పక తప్పదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన పంచాంగ పఠనాన్ని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్‌ శాస్త్రి చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆశ్లేష నక్షత్రం.. కర్కాటక రాశిలో జన్మించిన సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది చాలా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. అనుకూలంగా లేని సమయం పూర్తైందని.. గుహ నుంచి బయటకు వచ్చుడే తరువాయి అంటూ సినిమాటిక్ గా చెప్పిన తీరు చూస్తే.. శాస్త్రి గారి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం.

గుహ నుంచి బయటకు రావుడంటే.. మృగరాజు వేటాడేందుకు గుహ నుంచి బయటకు వస్తే పరిస్థితి..దానికి ఎంత సానుకూలంగా ఉంటుందో అన్న భావాన్ని గుర్తు చేసేలా ఆయన పోలిక ఉండటం గమనార్హం. జాతక బలాన్ని చూస్తే.. గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుందని.. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుందన్నారు.

శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుననా.. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారన్నారు. సాహసోపేత నిర్ణయాల్ని తీసుకుంటూ విశ్వరూపమే చూపిస్తారంటూ కేసీఆర్ కు ఈ కొత్త సంవత్సరం ఏ తీరులో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.

శుభకృత్‌ నామ సంవత్సరంలో కరోనా భయం ఉండదని.. తెలంగాణలో అద్భుత పాలనను కళ్లారా చూస్తామన్నారు. తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా అంటూ.. కేసీఆర్ కు తిరుగులేదన్న విషయాన్ని చెప్పేశారు. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది.

చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంజింపజేస్తారంటూ గులాబీ బాస్ మనుసు దోచుకునే మాటల్ని ఒక రేంజ్లో చెప్పేశారనే చెప్పాలి. కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉందని.. ఎవరు ఎవరిని ఎప్పుడు కలుస్తుంటారు? అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారని.. పార్టీ మారే వారికి గడ్డుకాలంగా చెప్పిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఉగాది పంచాంగ శ్రవణంలోకి రాజకీయం బాగానే చొచ్చుకొచ్చినట్లుగా చెప్పక తప్పదు.

ఆయన వినిపించిన పంచాంగ శ్రవణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధం లేని అంశాలు ఏమైనా ఉన్నాయంటే.. అందులో ముఖ్యమైనది.. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఈ ఏడాది వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోతుందని.. ఆన్ లైన్ క్లాసులు ఉండవని.. బడి గంటలు మోగుతాయన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉండవని.. మాస్కుల అవసరం రాదని.. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చన్నారు.

 సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయని.. ఏప్రిల్.. మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. పాకిస్తాన్ తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అనుకూలంగా ఉందని చెప్పారు. మరి.. శాస్త్రిగారి మాటల్లో నిజమెంత? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.
Tags:    

Similar News