ధనిక రాష్ట్రంలో ఈ బాదుళ్లు ఏంది కేసీఆర్?

Update: 2022-05-19 02:55 GMT
సంక్షేమం తప్పించి షాకులు ఇవ్వటానికి పెద్దగా ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. కేసీఆర్ 1.0 పాలనకు భిన్నంగా కేసీఆర్ 2.0 సర్కారు నడుస్తోంది. గతంలో వరాలు మాత్రమే ప్రకటించే కేసీఆర్.. ఇటీవల కాలంలో వరాల్ని పక్కన పెట్టేసి.. బాదుడు షురూ చేయటం తెలిసిందే. రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేయటం మొదలుకొని విద్యుత్ చార్జీలు.. బస్సు చార్జీలు.. ఇలా ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా వసూళ్లను పెంచుకోవటంపైనే ఫోకస్ పెడుతున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

గతంలో వరాల దేవుడిగా ఆయన్ను అభివర్ణించారు.. ఇప్పుడు ఆయన్ను బాదుడుకు బాస్ గా భావించే పరిస్థితి. పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించే విషయంలో ఆయన ఏ మాత్రం కనికరం చూపించటం లేదన్నది తెలిసిందే.

ఆ మధ్యన కేంద్రం తన సెస్ ను కొంతమేర తగ్గించి.. మరికొంత రాష్ట్రం కూడా తగ్గిస్తే ప్రజల మీద భారం తగ్గుతుందని చెప్పినా.. ఆయన మాత్రం ఆ అంశాన్ని అమలు చేయకపోవటం తెలిసిందే. పెట్రో భారం మొత్తం కేంద్రానిదే పూచీ అని వాదిస్తూ.. కేంద్రం పెంచిన ధరల కారణంగా.. తమకు పెరిగిన ఆదాయం గురించి మాత్రం మాట్లాడకపోవటం కేసీఆర్ టాలెంట్ గా చెప్పక తప్పదు.

కేంద్రం తప్పుల గురించి ఎత్తి చూపుతున్న ఆయన.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఆ అంశాలేవీ ఎందుకు గుర్తుకు రానట్లు? అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రావట్లేదు. ఇదిలాఉంటే.. గల్లా పెట్ట ఖాళీ అయిన వేళ.. దాన్ని అప్పులతో భర్తీ చేయాలనుకుంటే అదేమీ సాధ్యం కాకపోవటంతో.. ఇప్పుడు ప్రజలకు వాతలు పెట్టేందుకు ఆయన వెనుకాడటం లేదు. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వరుస పెట్టి బాదేస్తున్న వైనం చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని బాదుళ్లు గ్యారెంటీ అన్న భావన కలగటం ఖాయం.

ఇప్పటికే అవకాశం ఉన్న అన్ని రంగాలకు ధరల మోత మోగించేసిన ఆయన.. తాజాగా మద్యం ధరల్ని పెంచాలనుకోవటం వెనుక కూడా.. అదనపు ఆదాయమే లక్ష్యమన్నది తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా సంపన్న రాష్ట్రంగా గొప్పలు చెప్పుకునే ఆయన నోటి నుంచి ఈ మధ్య కాలంలో ధనిక రాష్ట్రమన్న మాట రాకపోవటం గమనార్హం.

సంపన్న రాష్ట్రంగా తెలంగాణను అభవర్ణించే సీఎం కేసీఆర్.. ప్రజల మీద భారం మోపేలా ఎందుకు నిర్ణయాల్ని తీసుకుంటున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. గులాబీ బాస్ ఆ పని చేస్తారంటారా?
Tags:    

Similar News