రాజకీయ సంచలనమట : కేసీయార్ ఏం చెబుతారంటారూ... ?

Update: 2022-05-26 13:14 GMT
సంచలనం అంటే సంచలనమే. దానికి తెలుగు డిక్షనరీలో వేరే అర్ధాలు లేవు. అయితే రాజకీయ నాయకుల పరిభాషలో  చూస్తే వారికి పదవులు వస్తే అది సంచలనం. వారికి అందలాలు దక్కితే అది మహా సంచలనం. కానీ అద్భుతాలు అయినా సంచలనాలు అయినా ఒకరు సృష్టించలేరు. అవి వాటంటత అవే రావాలి. ఎన్టీయార్ 1982లో టీడీపీ స్థాపించినపుడు సంచలనం సృష్టిస్తాను అని ఏమైనా చెప్పారా. కానీ అది జరిగింది. దానికి కారణం ప్రజలు.

ఇక దేశ రాజకీయాల్లో రెండు మూడు నెలలలో సంచలనం  నమోదు అవుతుంది అని ఈ మధ్య తరచూ కేసీయార్ ప్రకటిస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ని కలసి వచ్చారు. పంజాబ్ వెళ్ళి వచ్చారు. ఇపుడు కర్నాటక వెళ్ళి మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిశారు. ఈ సందర్భంగా మరో మారు సంచలనం చూస్తారు అని అంటున్నారు.

ఇంతకీ కేసీయార్ సంచలనం అని అంటున్నా జనాలకు దాని మీద ఆసక్తి ఉందా. ఇక ఆయన పోకడలు కానీ చేస్తున్న టూర్లు కానీ చూస్తే సంచలనాలు నమోదు అయ్యే దిశగా ఉన్నాయా అన్నది ఒక చర్చ.  కేసీయార్ విషయంలో తెలంగాణాకు చెందిన విపక్షాలు చేస్తున్న విమర్శ ఒకటి ఉంది. ఆయనకు ఆయనే కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టి వస్తున్నారు. కలసిన వారినే పదే పదే కలుస్తున్నారు. ఇందులో వింత కానీ విడ్డూరం కానీ ఏముంది అని లైట్ తీసుకుంటున్నారు.

నిజానికి కేసీయార్ వద్దకు ఏ విపక్ష నాయకుడు జాతీయ స్థాయి నుంచి వచ్చి కలవలేదు అన్నదే వారి మాట. అది నిజం అనే అంటున్నారు ఇక కేసీయార్ కలసినా కలవకపోయినా కేజ్రీవాల్ కానీ దేవెగౌడ కానీ మరికొందరు నాయకులు కానీ అంతా బీజేపీకి యాంటీగానే ఉంటున్నారు. ఇక కొత్తగా అటు ఎన్డీయే కాకుండా ఇటు యూపీయే కాకుండా  తటస్థంగా ఉన్న నాయకులతో కేసీయార్ భేటీలు వేసి యాంటీ బీజేపీ టీమ్ ని రెడీ చేస్తున్నామంటే ఆసక్తి ఎవరికైనా ఉండేది.

ఇవన్నీ ఎందుకు పొరుగున ఉన్న ఆంధ్రా సీఎం జగన్ తో ఇప్పటిదాకా కేసీయార్ జాతీయ రాజకీయాల ఇష్యూస్ మీద భేటీ అయినది లేదు. ఏపీలో ఉన్న విపక్ష నేత చంద్రబాబుతో అయినా ఆయన మాట్లాడింది లేదు. మరి ఇలా కీలక నేతలను అందునా సాటి తెలుగు వారిని వదిలేసి దేశమంతా చుట్టి వస్తూ సంచలనం అని కేసీయార్ అంటే నమ్మదగినదిగా ఉందా అన్నదే ప్రశ్న.

ఇంతకీ కేసీయర్ చెప్పదలచినది ఏమిటీ అంటే దేశంలో డేబ్బై అయిదేళ్ళు గడచినా అనేకమైన సహజ వనరులు ఏవీ సరిగ్గా వాడుకోలేకపోతున్నామని, మరి ఆ విషయంలో కేంద్రంలో ఉన్న పార్టీలతో పాటు రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కూడా బాధ్యత వహించాలి కదా. మరి తెలంగాణాలో ఆ విధంగా ఎంతమేరకు వనరులు వాడుకున్నారు. ఎంతమేరకు అభివృద్ధి సాధించారు ఇవి కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఏది ఏమైనా రాజకీయ  ఫ్రంటులు కడితేనో, కూటములు పెడితేనో సంచలనాలు నమోదు కావు. దేశ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తేనే అలా అనుకుంటారు అంతా. మరి అది జరగనపుడు సంచలనాలు అని ఎవరు చెప్పినా జనాల నుంచి నో రియాక్షన్. అంతే.
Tags:    

Similar News