ఇదేం లెక్క కేసీఆర్? తెలంగాణపై కన్నేస్తేనే ఢిల్లీలో గద్దె దించుతారా?

Update: 2022-07-03 02:58 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కోపం గులాబీ బాస్ కేసీఆర్ కు కట్టలు తెగుతోందా? ఆ ఆగ్రహమే ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటలు వేలెత్తి చూపించేలా మారాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా కాకుండా ఒక సేల్స్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నట్లుగా మండిపడిన వైనంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు.. మోడీ పని తీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని దుయ్యబట్టిన కేసీఆర్.. ‘రెచ్చగొడుతూ భారత దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు’ అంటూ ఆరోపించారు.

ఇంత మాట్లాడిన కేసీఆర్.. భలేగా చెప్పారన్న భావన ఉన్నోళ్లు సైతం.. ఆ తర్వాత గులాబీ అధినేత నోటి నుంచి వచ్చిన మాటలకు మాత్రం.. ఇవేం మాటలు భయ్ అనేలా మారాయని చెప్పాలి. కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యాల చిట్టాను విప్పిన కేసీఆర్.. ఆ తప్పుల్ని సరిదిద్దేందుకు డిల్లీ గద్దె నుంచి దింపుతామంటే పద్దతిగా ఉండేది. అందుకు భిన్నంగా దేశంలో ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చారని.. మహారాష్ట్రలో మాదిరి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలదోస్తామని చూస్తే మాత్రం ఢిల్లీలో వారిని గద్దె దించుతామని చెప్పటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని టచ్ చేయకుండా.. మరెన్ని చేసినా కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మోడీ సర్కారు పని తీరు బాగోకుంటే.. దాని మీద పోరాటం చేయాలి. అంతే తప్పించి.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ఢిల్లీలో గద్దె దించుతామన్న మాటలో పస లేదని చెప్పాలి. నాకిది చేస్తే.. నీకు అది చేస్తానన్న క్రిడ్ ప్రోకో నెగిటివ్ వెర్షన్ మాదిరి  కేసీఆర్ మాటలు ఉన్నాయి. నాకు నష్టం చేస్తే.. నీకు నష్టం చేస్తానన్నట్లుగా ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

దేశ ప్రజల కోసం.. వారి హితం కోసం.. మోడీ సర్కారును దించేస్తామన్నమాటలకు బదులుగా ఇలాంటి మాటలు కేసీఆర్ నోటి నుంచి రావటం చూస్తే.. ఆయన విపరీతమైన ఒత్తిడితో ఉన్నారా? అన్న సందేహానికి అస్కారం ఇచ్చేలా కేసీఆర్ తాజా మాటలు ఉన్నాయన్నారు. ఎన్నికల వేళ మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని.. టార్చిలైట్ వేసి వెతికినా అమలు చేసినవేమీ కనిపించవన్నారు. తానే శాశ్వితం అన్న భ్రమలో మోడీ ఉన్నారని.. కానీ.. కేంద్ర రాజకీయాల్లో మార్పు తప్పకుండా జరగుతుందన్న కేసీఆర్ మాటలన్ని.. కమలనాథులు తెలంగాణ మీద కన్నేశారన్న ఆక్రోశం తప్పించి.. మోడీ సర్కారు తీరుపై ఉన్న ఆగ్రహంతో మాత్రం కాదన్నట్లుగా ఉన్నాయంటున్నారు. అందుకు తాజా వ్యాఖ్యలు నిదర్శమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News