సారు సర్వే రిపోర్టుల వేళ.. మంత్రుల సొంత సర్వేల్లో షాకింగ్ నిజాలు?

Update: 2022-07-31 12:30 GMT
ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు.. అధినేతలు.. కాస్తంత పలుకుబడి ఉన్న కొందరు రాజకీయ నేతలు సర్వేలు నిర్వహించేవారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఎప్పటికప్పుడు చేయించే నేతలు కొందరు ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఎన్నికలకు చాలానే సమయం ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొందరు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తుంటారు. ఆ కోవలోకే వస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

రాజకీయ వ్యూహకర్త పీకేతో కలిసి.. పార్టీ పరిస్థితిపైనా.. నియోజకవర్గాల వారీగా ఈ మధ్యన సర్వే చేయించటం.. దానికి సంబంధించిన వివరాలు పలువురు అధికారపక్ష నేతల చేతికి చేరటం తెలిసిందే. ఈ సర్వే ఫలితాల్ని చూసి కంగుతిన్న టీఆర్ఎస్ నేతలు కొందరు తమకు తాముగా రంగంలోకి దిగి.. తమకు నమ్మకస్తుల చేత సర్వేలను సొంతంగా చేయించుకుంటున్నారు. ఈ మధ్యన కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైంది. దీనికి తగ్గట్లే.. .ఒక సంస్థకు మరో సంస్థకు సంబంధం లేకుండా సర్వే ఫలితాలు ఉండటంతో కాస్తంత గందరగోళంగా మారింది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పలువురు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలకు ఎవరికి వారుగా సర్వేలు చేయించుకున్న వైనం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమ బిగ్ బాస్ కేసీఆర్ చేయించిన సర్వేలకు మంత్రుల సర్వేలు కౌంటర్ ఇచ్చేలా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి కొందరు మంత్రులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతంగా చేయించుకున్నట్లు చెబుతున్న సర్వేల్లో వెల్లడించిన విషయాల్ని చూస్తే.. మొత్తం 12 నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్ పూర్.. పరకాల.. మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇక.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలో గ్రామాలను యూనిట్ గా తీసుకొని సర్వే నిర్వహించారు. ఇక్కడ ఆయన పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాపై సొంతంగా సర్వేను మంత్రి జగదీష్ రెడ్డి చేయించారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆలేరు.. తుంగతుర్తి.. భువనగిరి ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తమవుతోందట. ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జరిపిన లేటెస్టు సర్వే ప్రకారం.. జిల్లాలోని ఖమ్మం.. కొత్తగూడెం.. పాలేరు.. ఇల్లందు.. అశ్వారావుపేట.. వైరా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారినట్లు చెబుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సర్వేలో పలుచోట్ల అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంతంగా చేయించుకున్న సర్వేలో.. బాల్కొండ.. కామారెడ్డి.. బోధన్.. బాన్సువాడ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకత ఉన్న విషయాన్ని సర్వే రిపోర్టులు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్వే చేయించుకున్నారని.. జిల్లాకు చెందిన ఎల్బీ నగర్.. ఇబ్రహీంపట్నం.. మహేశ్వరం.. కుత్భుల్లాపూర్.. మేడ్చల్.. ఉప్పల్ నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేనట్లుగా రిపోర్టులు వచ్చినట్లు చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించిన సెంటిమెంట్ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. జిల్లాకు చెందిన వనపర్తి.. నారాయణ పేట్.. మహబూబ్ నగర్ అసెంబ్లీ సిగ్మంట్లలో ఒకసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు రెండోసారి గెలవటం ఇప్పటివరకు లేదు. ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని సర్వేలో వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలతో పాటు కల్వకుర్తి.. అచ్చంపేట నియోజకవర్గాల్లోనూ సానుకూలత లేనట్లుగా తేలినట్లు తెలుస్తోంది. మంత్రులు చేయించుకున్న సర్వేల్లో పలుచోట్ల పార్టీ మీద ప్రజలు పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. స్థానిక గులాబీ ఎమ్మెల్యేల మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. మంత్రుల సర్వే రిపోర్టులపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News