అంత దమ్మే ఉంటే.. ముఖాముఖిన అడిగేయొచ్చుగా కేసీఆర్?

Update: 2022-08-07 04:40 GMT
ప్రెస్ మీట్ పెట్టింది మొదలు పూర్తి అయ్యే వరకు టార్గెట్ పెట్టుకున్న వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే విషయంలో యావత్ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించినోళ్లు ఉండరే చెప్పాలి. కేంద్రం మీదా.. కేంద్రంలోని మోడీసర్కారు మీదా.. అప్పుడప్పుడు కొన్ని కీలక సంస్థల తీరు మీద అదే పనిగా విమర్శలతో విరుచుకుపడే విషయంలో కేసీఆర్ ను కొట్టినోళ్లే కనిపించరు. మరింత సిత్రమైన విషయం ఏమంటే.. తనకు ఇష్టం లేని వాటిని ఇట్టే బహిష్కరించే అలవాటులో ఆయన ముందుంటారని చెప్పాలి.

పేపర్ పులి అన్నట్లుగా.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే చాలు.. వెనుకా ముందు విరుచుకుపడే సీఎం కేసీఆర్ తీరుకు సంబంధించిన కొందరు అడిగే క్వశ్చన్లకు ఆయన ఎలా బదులిస్తారో తెలిసిందే. తాను చెప్పాలనుకున్న విషయాల్ని క్లియర్ గా చెప్పేసే ఆయన.. పాత్రికేయులు అడిగే ప్రశ్నలకు మాత్రం సూటిగా సమాధానం చెప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ.. ఎవరైనా క్లిష్టమైన ప్రశ్నను సంధిస్తే.. సదరు పాత్రికేడ్రి ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు.. మిగిలిన వారిని నవ్వుకునేలా చేసి.. ఎందుకు ప్రశ్న వేశామురా? భగవంతుడా? అన్న రీతిలో రిపోర్టర్లు ఫీలయ్యేలా చేయటంలో ఆయనకున్న అనుభవం అంతా ఇంతా కాదు.

తాజాగా మోడీతో చెడిన నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరయ్యే అవకాశమే లేదన్న ఆయన.. నీతి ఆయోగ్ ను ఉద్దేశించి ఘాటువిమర్శలు చేయటం సంచలనంగా మారింది. నీతి ఆయోగ్ ను ఒక పనికిమాలిన సంస్థగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ తీరుపై సంస్థ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారు. కేంద్రం తరచూ తమను మోసం చేస్తుందనో.. ఇబ్బంది పెడుతుందన్నదే పాయింట్ ను ప్రధాన ఎజెండాగా మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పని చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

అదే పనిగా కేంద్రాన్ని.. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఉద్దేశించి గళం విప్పే సీఎం కేసీఆర్.. అదే ఢిల్లీకి నేరుగా వెళ్లి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే ప్రోగ్రాంకు వెళ్లటం.. చర్చలో భాగంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఏకరువు పెడితే బాగుంటుంది కదా? తన వాదనలో భాగంగా తెలంగాణను మోడీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందన్న దానికి సంబంధించిన వాదనను.. ప్రధాని ఎదుటనే ప్రశ్నిస్తే మరింత బాగుంటుంది కదా?

అదేమీ చేయకుండా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటం వల్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించదన్న చిన్న విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు మర్చిపోతారు? ప్రెస్ మీట్లుపెట్టి మీడియా ప్రతినిధుల్ని అదరగొట్టే ఆయన.. జాతీయ స్థాయి వేదిక మీద రాష్ట్ర ప్రయోజనాల మీద గళం విప్పితే మరింత ప్రభావవంతంగా ఉండటమే కాదు.. ప్రధాని గొంతులో పచ్చి ఎలక్కాయ పడే ఛాన్సును ఎందుకు చేజార్చుకుంటున్నట్లు?
Tags:    

Similar News