టీ కాంగ్రెస్‌లో చింత‌.. ఆ నాయ‌కుల్లో క‌ల‌త‌..!

Update: 2022-06-01 14:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ లోని కీల‌క నాయ‌కుల్లో భ‌యం ప‌ట్టుకుందా..? ఏఐసీసీ తీసుకున్న ఆ నిర్ణ‌యంతో వీరిలో క‌ల‌వ‌రం మొద‌లైందా..? ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్లు క‌ష్ట‌మేనా..? ఇక్క‌డ చింత‌న్ శిబిర్ లో ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతారా..? ఈ అంశంపై ఆ కీల‌క నాయ‌కులు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.

ఇటీవల రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో ఏఐసీసీ చింత‌న్ శిబిర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది ప్ర‌తినిధులు ఈ స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఇందులో ప‌లు కీల‌క‌మైన తీర్మానాల‌ను ప్ర‌తిపాదించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌ని.. పార్టీలో, ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద ఎత్తున భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని.. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాల‌ని.. 70 ఏళ్లు దాటిన వారికి, వ‌రుస‌గా రెండు సార్లు ఓడిన వారికి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వొద్ద‌నే నిర్ణ‌యాల‌ను ఆ చింత‌న్ శిబిర్ లో తీసుకున్నారు.

అక్క‌డ జ‌రిగిన తీర్మానాల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ అన్ని రాష్ట్రాల్లో చింత‌న్ శిబిర్ లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఏఐసీసీ ఆదేశాల‌క‌నుగుణంగా తెలంగాణ‌లో కూడా ఆ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది పీసీసీ. జూన్ 1, 2 తేదీల్లో హైద‌రాబాద్ శివార్ల‌లో చింత‌న్ శిబిర్ స‌మావేశాల‌ను జరుపుతోంది.

దీనికి సంబంధించి పీసీసీ ఆరు క‌మిటీల‌ను వేసింది. అయితే ఈ క‌మిటీల్లో ఉన్న వారంద‌రూ ఆయా తీర్మానాల‌కు మ‌ద్ద‌తు తెలుపుతారా..? లేదా వ్య‌తిరేకిస్తారా..? అనే అనుమానాలు పార్టీ వ‌ర్గాల్లో నెల‌కొన్నాయి. వ్య‌తిరేక‌త ఉన్నా ఏఐసీసీ ఆదేశం క‌నుక లాంఛ‌నంగా ఆమోదించే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంది.

ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వారు పోటీచేయ‌కూడ‌ద‌నే అంశం పార్టీ సీనియ‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంద‌ట‌. పార్టీ సీనియ‌ర్లు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, జానారెడ్డి, సౌదాగ‌ర్ గంగారాం, స‌ర్వే స‌త్యనారాయ‌ణ‌, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, పి సుద‌ర్శ‌న్ రెడ్డి, కోదండ‌రెడ్డి, నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, రేణుకా చౌద‌రి, గీతారెడ్డి, సంభాని చంద్ర‌శేఖ‌ర్‌, టి జీవ‌న్ రెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్లు బెంగ పెట్టుకున్నార‌ట‌. ఎందుకంటే వీరిలో చాలా మంది సీనియ‌ర్లు వ‌చ్చే సారి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు.

ఇపుడు 70 ఏళ్ల నిబంధ‌న అమ‌లైతే వీరి గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లే. వీరిలో చాలా మంది రెండోసారి కూడా ఓడ‌డంతో టికెట్లు గ‌ల్లంత‌యిన‌ట్లే. ఏఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంద‌ట‌. ఎందుకంటే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను ఎద‌గ‌కుండా చేసి ఏళ్లుగా వీరే రాజ‌కీయాలు న‌డుపుతున్నార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇపుడు ఆ చింత‌న్ శిబిర్ తీర్మానాల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డ‌మంటే త‌మ స‌మాధి తాము త‌వ్వుకోవ‌డ‌మేన‌నే ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌. చూడాలి మ‌రి ఏం చేస్తారో..!
Tags:    

Similar News