2018లో కాంగ్రెస్ టార్గెట్ తెలిసిపోయింది

Update: 2018-01-01 23:30 GMT
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉండి 2017లో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ కొత్త సంవ‌త్స‌రానికి త‌గిన రీతిలో ప్ర‌ణాళిక‌లు వేసుకుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ ఏర్పాటు త‌రువాత రాష్ట్ర కాంగ్రెస్ కు అన్నీ క‌ష్టాలే ఎదుర్కొని 2014 ఎన్నిక‌ల్లో ప్రధాన‌ ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మైన కాంగ్రెస్ పార్టీకి 2017లో ప్రతినెల ఒక్కో మెట్టు గ్రాఫ్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇక తామే ప్రత్యామ్నాయ‌మ‌ని చాటుకుంది. 2018లో ఇదే దూకుడుతో పాత ఫార్ములాకు కొత్త ట‌చ్ ఇస్తూ ముందుకు సాగేందుకు సిద్ధ‌మైంది.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన తర్వాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొద‌లుకొని ఆ త‌రువాత వ‌చ్చిన వ‌రుస ఉపఎన్నిక‌లు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి. వాటికి తోడు అధికార టీఆర్ ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో ఎమ్మెల్యే - ఎమ్మెల్సీల భారీ వ‌ల‌స‌లు పార్టీకి పెద్ద కుదుపును మిగిల్చాయి. అయితే వాట‌న్నింటినీ అధిగ‌మించేలా 2017లో స‌రికొత్తగా హ‌స్తం పార్టీ దూకుడు పెంచింది. ఆ ఏడాది జ‌న‌వ‌రిలో కేంద్ర‌ - రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విదానాల‌పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టిన టి.కాంగ్రెస్ క‌లెక్టరేట్ల ముందు ధ‌ర్నాల‌తో పాటు హైద‌రాబాద్ లో చార్మినార్ నుంచి గాంధీభ‌వ‌న్ వ‌ర‌కు భారీ ర్యాలీ స‌మ‌ర‌శంఖాన్ని పూరించారు. హైద‌రాబాద్ లో ఇందారాపార్కులో ధ‌ర్నా చౌక్ ఎత్తివేయ‌డంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టిన కాంగ్రెస్ ఈ అంశాన్ని ఇటు రాష్ట్రంలో గ‌వ‌ర్నర్ దృష్టికి తీసుకెళ‌డంతో పాటు రాష్ట్రప‌తి గ‌డ‌ప తొక్కి జాతీయ‌స్థాయిలో కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని పెద్దె ఎత్తున జ‌నంలోకి తీసుకెళ్ళిన కాంగ్రెస్ జ‌నావేద‌న స‌భ‌ల‌తో హోరెత్తించారు. నిజామాబాద్ - వ‌రంగ‌ల్ జిల్లాల‌తో స‌హా అన్ని జిల్లాల్లో స‌భ‌లు పెట్టి నోట్లర‌ద్దుతో ప్రజ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఫోక‌స్ చేశారు. ఖ‌మ్మం జిల్లాలో మిర్చీ రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని రాజ‌కీయంగా బాగా వాడుకున్న కాంగ్రెస్ ఈ ఇష్యూపై స‌ర్కారును బ‌ద్‌నాం చేసేలా సీఎల్పీ బృందంతో బాధిత రైతుల‌ను ప‌రామ‌ర్శించిన నేత‌లు జిల్లాలో మిర్చీ యార్డుల విజిట్ తో కేసీఆర్ స‌ర్కారుపై దుమ్మెత్తి పోసేందుకు ఉప‌యోగించుకున్నారు. దీంతోపాటుగా గ‌ల్ఫ్‌ బాదితుల స‌మ‌స్యల‌పై ఫోక‌స్ పెంచిన కాంగ్రెస్ వారి స‌మ‌స్యలు వాటి ప‌రిష్కారంలో కేసీఆర్ అనుస‌రిస్తున్న నిర్లక్ష్యాన్ని ఫోక‌స్ చేస్తూ ఎగ్జిబీష‌న్ గ్రౌండ్ లో ఓ స‌ద‌స్సును నిర్వహించారు.

దీంతో పాటుగా రాహుల్ గాంధీ ప‌ర్యట‌న పార్టీలో స‌రికొత్త ఊపు ఇచ్చింది. సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బ‌హిరంగ ప్రజాగర్జన స‌భ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మియాపూర్ భూ కుంభ‌కోణం వెలుగులోకి రావ‌డంతో ఆ ఇష్యూను కాంగ్రెస్ రాజ‌కీయంగా బాగా వాడుకుంది. ఈ భూస్కామ్ లో అన్ని పార్టీల‌ను ప్రజాసంఘాల‌ను కూడ‌గ‌ట్టి కేసీఆర్ కుటుంబాన్ని బ‌ద్నాం చేయ‌డంలో హ‌స్తం నేత‌లు స‌క్సెస్ అయ్యారు. వీటికి  తోడు సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామంలో ద‌ళితుల‌పై పోలీసుల దాడి కాంగ్రెస్ కు బాగా క‌లిసి వ‌చ్చింది. సిరిసిల్లలో ఇసుక మాఫియా పేరుతో గులాబీ స‌ర్కారును ఇరుకునపెట్టిన హ‌స్తం నాయ‌కులు ద‌ళితుల‌పై కేసీఆర్ స‌ర్కారు అణ‌చివేత ధోర‌ణి అవ‌లంభిస్తోందంటూ పెద్దెత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇక ఇదే నెల‌లో క‌రీంన‌గ‌ర్ జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు డిమాండ్ తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాక‌ర్ చేప‌ట్టిన నిరాహార దీక్ష ఆ జిల్లోలో పార్టీకి బాగా క‌లిసివ‌చ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కంట్లో న‌లుసుగా మారిన టిడిపి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పుల‌కు కార‌ణ‌మైయ్యింది. రేవంత్ రాక‌తో కాంగ్రెస్ క్యాడ‌ర్ లో కూడా జోష్ నింపింది. స‌ర్కారుపై ఆయ‌న దూకుడుతో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ నెల‌లో ఫ‌స్ట్ వీక్ లో కాంగ్రెస్ చేప‌ట్టిన చ‌లో అసెంబ్లీతో రాష్ట్రంలో రైతాంగ స‌మ‌స్యల‌ను బాగా ఫోక‌స్ చేయ‌గ‌లిగింది కాంగ్రెస్.

 స్థూలంగా ఆందోళ‌న‌లు, స‌భ‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు హోరెత్తించారు.2017లో పార్టీ నేత‌ల్లో స్థైర్యాన్ని నింప‌గ‌లిగారు. ఇదే పంథాతో ముందుకు సాగి 2018లో కూడా పార్టీ బ‌లోపేతానికి కృషిచేయాల‌ని చూస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు చెప్తున్నారు.
Tags:    

Similar News