కాంగ్రెస్ నేత‌ల వేటుపై హైకోర్టులో హాట్ వాద‌న‌లు

Update: 2018-03-17 03:53 GMT
తెలంగాణ మండ‌లి ఛైర్మ‌న్ కు స‌భ‌లో గాయం అయ్యేందుకు కార‌ణ‌మైన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఇద్ద‌రిపై వేటు వేయ‌టం.. వారిని స‌భ నుంచి బ‌హిష్క‌రించిన వైనం ఇప్పుడు హైకోర్టు ముందుకు వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్ర స్పీక‌ర్ త‌న ప‌రిధిని దాటి వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా బ‌హిష్కృత ఎమ్మెల్యేలు ఆరోపించారు.త‌మ‌ను చ‌ట్ట విరుద్ధంగా స‌భ నుంచి బ‌హిష్క‌రించిన‌ట్లుగా ఆరోపించారు.

స‌భ నుంచి త‌మ‌ను అన్యాయంగా బ‌హిష్క‌రించిన వైనంపై కాంగ్రెస్ నేత‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై శుక్ర‌వారం హాట్ హాట్ వాద‌న‌లు జ‌రిగాయి. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాల్లో అసెంబ్లీ.. శాస‌న మండ‌లి ఉమ్మ‌డిగా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు. గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హిస్తున్న స‌భ‌లో ఆయ‌నే కీల‌కం. స‌భా నిర్వాహ‌ణ‌కు సంబంధించి ఏం నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌న్న‌ది ఆయ‌నే నిర్ణ‌యిస్తారని.. అయితే అందుకు భిన్నమైన ప‌రిస్థితులు చోటు చేసుకున్న‌ట్లుగా కాంగ్రెస్ నేత‌ల త‌ర‌ఫున వారి న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక‌ర్ త‌మ వాద‌న‌లు వినిపించారు.

స‌భా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఏ అంశ‌మైనా గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని.. కానీ స్పీక‌ర్ త‌మ ప‌రిధి దాటి ఎమ్మెల్యేల‌ను బ‌హిష్క‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశార‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ స‌ర్కారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న‌ల్ని కాంగ్రెస్ లాయ‌ర్ వినిపించారు.

ఈ నెల 12న గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించిన స‌భ‌లో ఘ‌ట‌న చోటు చేసుకోగా.. 13వ తేదీన స్పీక‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో నిర్ణ‌యం తీసుకున్నార‌ని వాదించారు. నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో పిటిష‌నర్లు స‌భ‌లో లేర‌ని.. వారి వివ‌ర‌ణ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని.. అనుచితంగా వ్య‌వ‌హ‌రించారంటూ తీర్మానం చేసి బ‌హిష్క‌రించిన‌ట్లుగా స్పీక‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం చ‌ట్ట విరుద్ధంగా కాంగ్రెస్ న్యాయ‌వాది వాదించారు.

ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని వాద‌న‌లు వినిపించారు కాంగ్రెస్ న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక‌ర్. ఆయ‌న చేసిన వాద‌న‌ల్లో కీల‌క‌మైన అంశాల్ని చూస్తే..

+ స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధించి రోజూ బులిటెన్ విడుద‌ల చేయాలి. కానీ.. ఇద్ద‌రు ఎమ్మెల్యేల బ‌హిష్క‌ర‌ణ‌పై బులెటిన్ విడుద‌ల చేయ‌లేదు.

+ క‌నీసం స‌భ్యుల‌కు నోటీసులు ఇవ్వ‌కుండా వారి వివ‌ర‌ణ తీసుకోకుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నారు.

+ శాస‌న‌స‌భ స్థానాలు ఖాళీ అయిన‌ట్లుగా ప్ర‌క‌టిస్తూ ఆఘ‌మేఘాల‌పై నోటిఫై చేశారు.

+ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై అభ్యంత‌రాలు ఉంటే ప్రివిలేజ్ క‌మిటీ ముందు ఉంచి నోటీసులు ఇవ్వాల్సి ఉంది.

+ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌భ్యుల వివ‌ర‌ణ తీసుకున్న త‌ర్వాతే చ‌ర్య‌లు తీసుకోవాలి.

+ హెడ్ ఫోన్ విసిరార‌న్న కార‌ణంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై చ‌ర్య తీసుకున్నారు స‌రే. ఆ ఘ‌ట‌న‌తో సంబంధం లేకుండా మౌనంగా ఉన్న సంప‌త్‌.. ఇతర ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య తీసుకున్నారు?

+ స‌భ‌లో ఘ‌ర్ష‌ణ జ‌రిగి.. ఒక స‌భ్యుడ్ని మ‌రో స‌భ్యుడు క‌త్తితో పొడిచినా.. నేరుగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవ‌టానికి వీల్లేదు.

+  సభ్యుల్ని బ‌హిష్క‌రించాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నా.. అది సెష‌న్ ముగిసే వ‌ర‌కూ మాత్ర‌మే ఉంటుంది.

+ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కూడా మండ‌లి ఛైర్మ‌న్ ఉల్లాసంగానే గ‌డిపారు. గ‌వ‌ర్న‌ర్ ను కారు దాకా వ‌చ్చి సాగ‌నంపారు.


Tags:    

Similar News