ఎక్కాల్సిన రైలు జీవితం కాలం లేటు

Update: 2017-11-27 05:48 GMT
ఎక్కాల్సిన రైలు జీవితం కాలం లేటు అన్న‌ట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరు చూస్తుంటే.  హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మెట్రో రైల్ ఉండాల‌న్న ఆలోచ‌న‌ను చంద్ర‌బాబు హయాంలో  మొద‌లైతే.. దాన్ని కార్య‌రూపంలోకి దాల్చిన ఘ‌న‌త దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. మెట్రో రైల్ కార్యాచ‌ర‌ణ‌.. వాస్త‌వ రూపంలోకి తెచ్చింది కాంగ్రెస్ ప్ర‌భుత్వానికే చెల్లుతుంది.

మెట్రో రైల్ ప‌నులు మొద‌ల‌య్యాక.. వేగంగా ప‌నులు జ‌ర‌గ‌టం కిర‌ణ్ కుమార్ రెడ్డి హాయంలో జ‌రిగింది. అంటే.. మెట్రో రైలుకు సంబంధించిన కీల‌క ప‌రిణామాల‌న్నీ కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనే చోటు చేసుకున్నాయి. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జ‌ర‌గ‌టం.. కేసీఆర్ ప్ర‌భుత్వం రావ‌టంతో మెట్రో ప‌నులు మంద‌గించాయి.

దేశంలో మొద‌టిసారి 30 కిలోమీట‌ర్ల దూరంలో మెట్రో రైలును ప్రారంభిస్తున్న‌ట్లు గొప్ప‌గా చెప్పుకుంటోంది తెలంగాణ ప్ర‌భుత్వం. నిజం చెప్పాలంటే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కానీ అధికారంలో ఉండి ఉంటే రెండేళ్ల కింద‌టే మెట్రో రైల్ ప్రారంభ‌మై ఉండేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  కానీ.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌టంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫ‌ల‌మైంది. మెట్రో రైల్ మైలేజ్ మొత్తం అధికార‌ప‌క్షం ఖాతాలోకి వెళ్లటంలో కాంగ్రెస్ నేత‌ల చేత‌కానిత‌నం కార‌ణంగా చెప్పాలి.

ముందునుంచి గ‌మ్మున ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. గాఢ‌మైన నిద్ర నుంచి ఉలిక్కిప‌డిన‌ట్లుగా మెట్రో రైల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు వారు ఈ విష‌యం మీద గావు కేక‌లు పెడుతున్నారు. లా పాయింట్లు తీసిన‌ట్లుగా  త‌న వాద‌న‌ను స‌మ‌ర్థ‌వంగా వినిపించ‌టంతో పాటు.. కేసీఆర్ స‌ర్కారు తీరును ఆస‌క్తిక‌రంగా త‌ప్పు ప‌ట్టేలా చేయ‌టంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ముందుంటారు.

మెట్రో రైలు నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర‌పై ఒక ప్ర‌జంటేష‌న్ ను సిద్ధం చేశారు శ్ర‌వ‌ణ్. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఘ‌న‌త త‌మ‌దేన‌ని చెప్పుకుంటున్న శ్ర‌వ‌ణ్.. త‌న వాద‌న‌కు బ‌లం చేకూరేలా ప్ర‌జంటేష‌న్ ను సిద్ధం చేశారు. 2014 డిసెంబ‌రు నాటికి  పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2018 న‌వంబ‌రు నాటికి  అని చెబుతున్నారు. ఎల్ అండ్ టీ మాత్రం డిసెంబ‌రు 2019 అని చెబుతోంద‌ని.. ఇందులో ఏది నిజమో చెప్పాలంటూ నిల‌దీస్తున్నారు.

మెట్రోకు సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తే మంత్రి కేటీఆర్ బెస్ట్ ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అవార్డును అందుకున్నార‌ని ఆయ‌న మండి ప‌డుతున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కార‌ణంగా 50 వేల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పార‌ని.. కానీ ఇప్పుడు స్థానికుల‌కు ఉద్యోగాలు లేకుండా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌నం మ‌దిలో వెళ్లే పాయింట్లు చేతిలో ఉన్నా.. వాటిని తీసుకెళ్లే విష‌యంలో మాత్రం శ్ర‌వణ్ ఫెయిల్ అయ్యార‌ని చెప్పాలి.

ఒక భారీ ప్రాజెక్టు త‌మ కార‌ణంగానే హైద‌రాబాద్‌కు వ‌చ్చింద‌న్న విష‌యం జ‌నాల‌కు తెలిసినా.. దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ పార్టీదే. ఆ విష‌యంలో వెనుక‌బ‌డిపోయిన కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు క్రెడిట్ కాస్తా కేసీఆర్ స‌ర్కారు ఖాతాలోకి వెళ్లేట‌ప్పుడు మాత్రం గావు కేక‌లు పెట్ట‌టంలో అర్థం లేదు.

మెట్రో ఆల‌స్యంపై ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌టం.. మెట్రో రైలు ఆల‌స్యానికి కేసీఆర్ స‌ర్కారును బాధ్యులుగా చేయ‌టంలోనూ విఫ‌ల‌మైన కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు క్రెడిట్ విష‌యం హైలెట్ అవుతున్న వేళ‌.. సీన్లోకి ఎంట‌రైతే పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మ‌రీ.. విష‌యాల్ని కాంగ్రెస్ నేత‌లు.. దాసోజ్ శ్ర‌వ‌ణ్ లాంటి వాగ్ధాటి ఉన్న నేత‌లు ఎందుకు మిస్ అవుతారో వారికే తెలియాలి.
Tags:    

Similar News