గాంధీ 'హింసా' భవన్

Update: 2018-11-11 12:12 GMT
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ హింసా భవన్ గా మారుతోంది. టిక్కట్ల రగడ ఆ పార్టీ కార్యకర్తలను నిలువనీయడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గాంధీ భవన్ గడచిన మూడు రోజులుగా ఉద్రిక్త వాతావరణం మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకుని తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. మహాకూటమిలో భాగంగా కొన్ని స్ధానాలను కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆశావాహులు తమ కార్యకర్తలతో గాంధీభవన్ ను చుట్టు ముడుతున్నారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన ఖానాపూర్ టిక్కట్ పై ముందుగా నిరసనలు మిన్నంటాయి. ఆ స్ధానాన్ని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు ఇవ్వరాదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరినాయక్ కార్యకర్తలు మూడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు ఆదివారం నాడు గాంధీభవన్ అట్టుడికేలా చేశాయి. ఇక నగర శివారులోని పటాన్ చెరు నియోజకవర్గం టిక్కెట్ ను వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.రాములుకు ఇవ్వాలంటే ఆయన వర్గీయులు గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తున్నారు.

నగరంలోని మరో నియోజకవర్గం మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీయే పోటీ చేయాలని - మహాకూటమిలో భాగంగా వేరే పార్టీకి ఇవ్వరాదంటూ ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు - కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ టిక్కట్ కూడా కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పులు తీసుకువస్తోంది. ఇక్కడ ఆది శ్రీనివాస్ కు టిక్కట్ ఇవ్వరాదని, ఇప్పటికే ఆయన అనేక పార్టీలు మారారని ఏనుగు మనోహర్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి కూడా గాంధీభవనే ఆందోళన వేదికైంది. వరంగల్  పశ్చిమ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సార్టీ మాత్రమే పోటీ చేయాలని పార్టీ నాయకులు - కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అహింసకు మారు పేరుగా నిలవాల్సిన గాంధీ భవన్ హింసకు ప్రతీకగా మారుతోందని కాంగ్రెస్ పెద్దలు వాపోతున్నారు.

Tags:    

Similar News