విలీనంపై కోర్టుకు కాంగ్రెస్‌.. ఏం జ‌ర‌గ‌నుంది?

Update: 2019-04-30 06:16 GMT
ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ప‌లువురిని ఆప‌రేషన్ ఆక‌ర్ష్ ద్వారా గులాబీ కారు ఎక్కించేసిన కేసీఆర్.. ప‌నిలో ప‌నిగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఉనికి లేని రీతిలో పావులు క‌ద‌ప‌టం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్య‌ధికుల్ని త‌మ పార్టీలోకి చేర్చుకుంటున్న కేసీఆర్.. ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్ర‌క్రియ‌లో చివ‌రి అంకంలోకి వ‌చ్చేశారు.

దీనిపై మేల్కొన్న కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు న్యాయ‌పోరాటానికి రెఢీ అవుతున్నారు. టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ విలీనాన్ని ప్ర‌శ్నిస్తూ.. ఈ విష‌యంలోకి జోక్యం చేసుకోవాలంటూ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌.. సీఎల్పీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తాజాగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై అత్య‌వ‌స‌రంగా విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర్టును కోరారు. దీంతో.. ఈ అంశంపై విచార‌ణ జ‌రిపేందుకు కోర్టు ఓకే చెప్పింది.

తాత్కాలిక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎ.రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ రోజు విచార‌ణ జ‌రిపేందుకు నిర్ణ‌యించారు. ఒక రాజ‌కీయ పార్టీని మ‌రో రాజ‌కీయ పార్టీలోకి విలీనం చేసే వ్య‌వ‌హారం పూర్తిగా ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోని అంశ‌మ‌ని.. 10వ షెడ్యూల్ ప్ర‌కారం ట్రిబ్యున‌ల్ గా వ్య‌వ‌హ‌రించే స్పీక‌ర్ ప‌రిధిలోని అంశం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

శాస‌న‌స‌భాప‌క్ష పార్టీని మ‌రో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీక‌ర్ కు లేద‌ని వాదిస్తున్న కాంగ్రెస్‌.. అస‌లు టీఆర్ఎస్ లోకి విలీనం చేసే ముందు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన త‌మ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని తాము దాఖ‌లు చేసిన ఫిర్యాదుపై నిర్ణ‌యం తీసుకోరా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

పార్టీ ఫిరాయించిన త‌మ ఎమ్మెల్యేల రాజ‌కీయ స్థాయిని నిర్ణ‌యించే ముందు.. త‌మ‌కు నోటీసులు ఇచ్చి త‌మ వాద‌న‌లు వినాల‌ని కోరుతున్నారు. ఈ అంశంపై తాము ఇప్ప‌టికే కేవియ‌ట్ దాఖ‌లు చేశామ‌ని.. టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం చేయ‌టం రాజ్యాంగ విరుద్ధంగా వారు చెబుతున్నారు. జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ‌పార్టీలో విలీనం చేయ‌టం సాధ్యం కాద‌న్న కాంగ్రెస్ నేత‌ల వాద‌న‌పై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ విలీనంపై గ‌రంగరంగా ఉన్న కాంగ్రెస్‌.. గులాబీ బాస్ ను న్యాయ‌ప‌రంగా అడ్డుకోవాల‌ని భావిస్తోంది. మ‌రి.. దీనికి కోర్టు స్పంద‌న కీల‌కం కానుంది. ఏది ఏమైనా.. కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు అయ్యేలా చేయాల‌న్న టీఆర్ఎస్ అధినేత ఆలోచ‌న రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు తెర తీస్తుందో కాల‌మే చెప్పాలి.
Tags:    

Similar News