అమెరికాలో హ‌త్యఃద‌య చూపితే క‌త్తితో పొడిచాడు

Update: 2017-09-16 06:01 GMT
అమెరికాలో మారుతున్న ప‌రిస్థితుల్లో ఎదుర‌వుతున్న‌ భ‌ద్ర‌త స‌మ‌స్య‌ల్లో ఇదో కోణం. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి అచ్యుత్ రెడ్డి హత్య కేసులో ఆయ‌న పేషెంట్లలో ఒకరైన భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల ఉమర్ రషీద్ దత్‌ ను అరెస్టు చేసినట్లు విచిటా పోలీసు డిపార్ట్‌ మెంట్ అధికారి లెఫ్టెనెంట్ టాడ్ ఓజిలి గురువారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.‘స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.20 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. అనుమానితుడ్ని కంట్రీ క్లబ్ వద్ద గుర్తించాం` అని తెలిపారు.

ఉమర్ రషీద్‌ దత్.. అచ్యుత్‌ రెడ్డి కుమారుడి పాఠశాల క్లాస్‌ మేట్ అని - ఉమర్ తండ్రికి అచ్యుత్‌ రెడ్డికి పరిచయం ఉన్నదని తెలిసింది. కేవలం ఈ కారణంతోనే, ఉమర్ ఉన్మాదంగా ప్రవర్తించినప్పటికీ, పలుమార్లు తనతో అనుచితంగా ప్రవర్తించినప్పటికీ అతడికి అచ్యుత్‌ రెడ్డి చికిత్సను కొనసాగించినట్లు వెల్లడయ్యింది. అయితే, ప్రతీసారి తండ్రితో కలిసి డాక్టర్ వద్దకు వచ్చే ఉమర్.. గురువారం మాత్రం ఒక్కడే వచ్చాడు. అచ్యుత్‌ రెడ్డిని హత్య చేయటం కోసమే ఒంటరిగా వచ్చాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమర్ రషీద్ దత్‌ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. ఉమర్ నివాసానికి సమీపంలో ఉండేవారు మాట్లాడుతూ - అతడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడని చెప్పారు. అతడు కాలేజీకి వెళ్లేది, వెళ్లనిది కూడా తెలియదని, తల్లిదండ్రులతో తరుచూ గొడవపడేవాడని పేర్కొన్నారు.

ఈ హ‌త్య గురించి విచిటా పోలీసు డిపార్ట్‌ మెంట్ అధికారి లెఫ్టెనెంట్ టాడ్ ఓజిలి వివ‌రిస్తూ.... బ‌ట్టలపై రక్తం మరకలతో ఓ అనుమానిత వ్యక్తి పార్కింగ్ స్థలం వద్ద కారులో కూర్చుని ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలియజేయడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేసినట్లు ఓజిలి చెప్పారు. 21 ఏళ్ల రషీద్ దత్ డాక్టర్ క్లయింట్ అని, ఆయన ఆఫీసు గదిలో కొద్ది సేపు ఉన్నట్లు కూడా దర్యాప్తులో తమకు తెలిసిందని ఆయన చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అతను తిరిగి వచ్చి డాక్టర్ రెడ్డితో కలిసి ఒక ఆఫీసులోకి వెళ్లాడని ఆయన తెలిపారు. ఆఫీసు లోపలికి వెళ్లిన తర్వాత గొడవ వినిపించినట్లు, ఆఫీసు మేనేజర్ ఒకరు అఫీసులోకి వచ్చి చూసే సరికి అనుమానితుడు డాక్టర్ రెడ్డిపై దాడి చేయడం కనిపించిందన్నారు. ఆమె దాడిని ఆపడానికి ప్రయత్నించారని, దీంతో డాక్టర్ బైటికి పరుగులు తీయగా, నిందితుడు అతడ్ని వెంటాడి అనేక సార్లు కత్తితో పొడిచాడని ఓజిలి చెప్పారు. డాక్టర్ రెడ్డి ఈ ప్రాంతంలో అనేక ఆస్పత్రుల్లో యోగా - ఫిట్నెస్ నిపుణుడుగా పని చేస్తున్నారు.

1986లో హైదరాబాద్‌ లోని ఉస్మానియా మెడికల్ కాలేజినుంచి ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్ రెడ్డి ఆ తర్వాత 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ మెడికల్ సెంటర్‌ లో తన రెసిడెన్సీ కోర్సును పూర్తి చేశారు. ఆయన సైకియాట్రీలో స్పెషలైజేషన్ చేశారు. ఈ సంఘటనపై విచిటాలోని భారతీయులు, స్థానిక వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Tags:    

Similar News