కమలనాథులకు కామెడీగా ఉందా? రాష్ట్రపతి పాలన అంత ఈజీనా?

Update: 2020-08-20 08:50 GMT
తెలంగాణ రాష్ట్ర సర్కారు వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యల వేడి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని తాకింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి రియాక్టు కావటమే కాదు.. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్టు చేసి డిలీట్ చేశారు. టీఆర్ఎస్ నేత చేసి వ్యాఖ్యలపై బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల నేతలు మండిపడ్డారు. సైదిరెడ్డి వ్యాఖ్యలకు గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని.. వాస్తవాలు మాట్లాడితే అభాండాలు వేస్తారా? అని బీజేపీ నేతలు మండిపడ్డారు.

గవర్నర్ వ్యాఖ్యల వెనుక బీజేపీనే ఉండి ఉంటే.. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన వచ్చేదంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పని తీరుపై తనకున్న అభిప్రాయాన్ని గవర్నర్ సుతిమెత్తగా వెల్లడించటం.. అందులోని కొంత విమర్శలు ఉండటం మహాపరాధంగా చెప్పలేం. కాకుంటే.. మిగిలిన టీఆర్ఎస్ నేతలంతా కామ్ గా ఉన్నప్పుడు.. వారికి తగ్గట్లు కాకుండా సైదిరెడ్డి కాస్త భిన్నంగా పోస్టు చేయటం తొందరపాటే అవుతుంది.

అదే సమయంలో.. టీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు రియాక్టు కావటం.. తమ మీద వేసిన మరకను తుడిపేసుకునే ప్రయత్నంలో.. ఒకట్రెండు వ్యాఖ్యలు చేయటం తప్పేమి కాదు. అలా అని.. ఈ మాత్రానికే రాష్ట్రపతి పాలన మాటను వాడటం అత్యుత్సాహమే అవుతుంది. పాలనా పరంగా కొన్ని లోపాలు చోటు చేసుకున్నంత మాత్రానికే.. రాష్ట్రపతి పాలన వరకు బీజేపీ నేతలు వెళ్లటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
రాజకీయంగా తమ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యే అంశాల మీద అధికార పక్షానికి చెందిన వారు రియాక్టు కావటం తప్పేం కాదు. అంత మాత్రానికే కమల నాథులు మరింత దూకుడు వ్యాఖ్యలు చేయటాన్ని ప్రజలు హర్షించరని చెబుతున్నారు. విమర్శలు చేసిన గవర్నర్ పై అంభాడాలు వేస్తారా? నిజంగానే గవర్నర్ వెనుక బీజేపీ ఉండి ఉంటే.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన చేసి ఉండేవారన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు కాస్త తొందరపాటుతో కూడుకున్నవిగా చెప్పక తప్పదు.

గవర్నర్ చేసిన వ్యాఖ్యల్నిమహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్నట్లుగా.. ఒక డాక్టర్ గా గవర్నర్ తమిళ సై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. వాటిని పాజిటివ్ గా తీసుకొని ఉండాల్సిందన్న ఆయన మాటల్ని ఎవరైనా ఆమోదిస్తారు. అంతేకానీ.. చిన్న విషయాలకే పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయటం కమలనాథులకు ఏ మాత్రం మంచిది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News