మంకీ పాక్స్ పై తెలంగాణ స‌ర్కార్ అప్ర‌మ‌త్తం.. గాంధీ ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు!

Update: 2022-07-16 07:30 GMT
ఓవైపు కోవిడ్ తో ఇప్ప‌డిప్పుడే ప్ర‌పంచ దేశాలు కోలుకుంటుంటే మ‌రోవైపు మంకీ పాక్స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్పటికే 64 దేశాలలో 9,200కి పైగా మంకీ పాక్స్ కేసుల గుర్తించినట్లు ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తాజాగా.. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు కేర‌ళ‌లోని కొల్లం జిల్లాలో నమోదైన సంగ‌తి తెలిసిందే. అమెరికా నుంచి ఇటీవల కేరళకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. దేశంలో మంకీ పాక్స్ తొలికేసు నమోదు కావడంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా జారీ చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికులు జ్వరం, జలుబు ఉన్న వాళ్లతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది. అదేవిధంగా ఎలుకలు, వన్యప్రాణులు, ఉడుతలు ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది. మంకీపాక్స్ లక్షణాలు కనిపించినా, కేసు నమోదైన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.

దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు కేర‌ళ‌లో నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్ర‌త్త‌గా అప్రమత్తమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీ పాక్స్ టెస్టులు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో మంకీ పాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే పూణె వైరాలజీ ల్యాబ్ నుంచి టెస్టింగ్ కిట్లను తెప్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. కిట్లు అందుబాటులోకి రాగానే ట్రయల్ రన్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా జూలై 21న మంకీ పాక్స్ పై ఏర్పాటు చేసిన‌ కమిటీతో సమావేశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటికే మంకీ పాక్స్ పై అత్యవసర కమిటీ తొలి సమావేశం జరిపింది. ఈ నేప‌థ్యంలో జూలై 21 21న రెండోసారి సమావేశం జర‌గ‌నుంది.
Tags:    

Similar News